Man Kills Wife and Two Daughters Over Gender Bias
మళ్ళీ ఆడపిల్లేనని… భార్య, ఇద్దరు కూతుళ్లను స్విమ్మింగ్ పూల్‌లో తోసి హత్య చేసిన కిరాతకుడు
వరంగల్. నేటిధాత్రి.
హనుమకొండ జిల్లా, ఐనవోలు మండలం, పున్నేలులో మానవత్వాన్ని మరిచిన దారుణ ఘటన చోటుచేసుకుంది. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానం, అబార్షన్‌కు భార్య అంగీకరించలేదనే కోపంతో భర్త అజారుద్దీన్ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మూడు నెలల గర్భిణిగా ఉన్న భార్యను, తన ఇద్దరు కుమార్తెలను సొంత స్విమ్మింగ్ పూల్‌లో తోసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అనంతరం ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
ఈ దారుణానికి పాల్పడే ముందు స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను ఆఫ్ చేసి, ముందస్తు ప్రణాళికతో నేరానికి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త అజారుద్దీన్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇక మృతురాలి బంధువులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో పున్నేలు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
అలాగే, ఈ కేసులో లింగ నిర్ధారణ జరిగిన అనుమానంతో సంబంధిత వైద్యుల కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
