కేంద్రంలో చక్రం తిప్పడమే లక్ష్యంగా రాజీకీయం…
మళ్లీ ప్రాంతీయ పార్టీల హవా దిశగా అడుగులు
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రచారం దిశగా
డిల్లీ వేధికగా తెలంగాణ నూతన ఆవిష్కరణలు…
కేసిఆర్ కీలకంగా భవిష్యత్తు రాజకీయాలు…
ఆలోచన ఒక్కటే చాలదు. ఆచరణ కావాలి. అవి పుష్కలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌లో వున్నాయి. కల కంటే చాలదు. నెరవేరే ప్రయత్నం చేయాలి. అందుకు కృషి చేయాలి. పట్టుదల చూపించాలి. ఇవన్నీ మెండుగా కేసిఆర్‌లో వున్నాయి. అందుకే ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు. పద్నాలుగేళ్ల అలుపు లేని పోరాటం చేశాడు. తెలంగాణ గొంతులన్నీ ఏకం చేశాడు. లక్ష్యం వైపు తనొక్కడేకాకుండా మూడు కోట్ల తెలంగాణ ప్రజలను వేలు పట్టి నడిపించాడు. రాజకీయ పార్టీలకు జై తెలంగాణ అనడమే అనివార్యం అనేదాకా తీసుకొచ్చాడు. తెలంగాణ ఇక ఇవ్వడం తప్ప ఏం చేయలేమని కేంద్రం ప్రకటించేలా ఉద్యమ రాజకీయ పోరాటం నడిపాడు. విజయం సాధించాడు. తెలంగాణ ఆవిష్కరణకు మూలమయ్యాడు. కీలకమయ్యాడు. తెలంగాణ కొత్త చరిత్రకు ఆద్యుడయ్యాడు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు తొలి, మలి ముఖ్యమంత్రిగా సంక్షేమరాజ్య ఆవిష్కరణకు బాటలు వేశాడు. ఇదీ ఒక లక్ష్య సాధకుడి పయనం. చేరుకున్న గమ్యం.
అలాగే ఇప్పుడు కేంద్రం వైపు అడుగులు…వెనకడుగు వేయని ఆత్మ విశ్వాసం కావాలి. అది కేసిఆర్‌లో కొండంత వుంది. వెనక్కి లాగేవారు చాలా మంది వుంటారు. జాగ్రత్తగా వుండాలి. ఇలాంటివి ఎన్నో తెలంగాణ ఉద్యమ కాలంలో చూసిన అనుభవం ఆయనకు సొంతం. వెన్నుపోటు పొడిచేవారు వుంటారు. వారి నుంచి అప్రమత్తంగా వుండాలి. ఇది బాగా తెలిసిన నేత కేసిఆర్. ఎందుకంటే తెలంగాణ జెండా ఎత్తిన తొలినాళ్లలో రాజకీయ అవసరాల కోసం, ఆయనతో కలిసి సాగి, పదవుల కోసం, పరపతి కోసం పాలకులాడిన వారు ఎంత మంది పంచన చేరారో కేసిఆర్‌కు బాగా తెలుసు. నమ్మి వారికి పదవులు అందిస్తే, టిక్కెట్లిచ్చి గెలిపిస్తే, ఉద్యమ నాయకుడు కేసిఆర్‌ను వెన్నుపోటు పొడిచేందుకు ఎంత మంది చూశారో చరిత్రకు తెలుసు. ఆయన భి`పారం ఇస్తే టిఆర్‌ఎస్ టిక్కెట్టు మీద గెలిచి, నాటి అధికార పార్టీకి కాంగ్రెస్‌కు, నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌కు కోవర్టులుగా మారిన వారు ఎవరో ప్రపంచానికి తెలుసు. టిఆర్‌ఎస్‌లోనే వుంటూనే కొంత మంది, పార్టీనుంచి దూరంగా జరిగి పదేపదే కేసిఆర్‌ను కించపర్చినవాళ్లున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి టిక్కెట్టు మీద గెలిచి తెలంగాణ రాదని ప్రకటించినవారున్నారు. కేసిఆర్ వల్ల అసలే రాదని స్వార్ధపూరిత రాజకీయాలు చేసి, రాజకీయ యవనిక మీద వారి పేర్లు వాళ్లంతట వాళ్లే చెరిపేసుకున్నవారు వున్నారు. ఇన్ని చూసి, అనుభవించి, ఎవరినీ నమ్మకుండా, ఒక్కడుగా ఒంటి చేత్తో పోరాటం చేసి, వచ్చేవారిని స్వాగతిస్తూ, వెళ్లేవారిని వదిలేస్తూ, తెలంగాణ సాధించిన నాయకుడు కేసిఆర్.
ఆయనకు ఎవరు ఎలా వెన్నుపోటు పొడుస్తారో పూర్తిస్ధాయిలో అనుభవం వున్న నాయకుడు. అలాంటి నాయకుడు ఎంత అప్రమత్తతో వుంటాలో కేసిఆర్‌కు మరోకరు చెప్పాల్సిన పనిలేదు. గుర్తుచేయాల్సిన అవసరం అంత కన్నా లేదు. అందుకే కేసిఆర్‌కు వున్నంత ముందు చూపు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేదనే చెప్పాలి. ఇక మనసంతా లక్ష్యం నింపుకోవాలి. అంటే కలైనా,నిజమైనా, తింటున్నా, పడుకున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, మౌనంగా వున్నా, ప్రతి క్షణం తలిచేదే లక్ష్యం. అలాంటి లక్ష్య సిద్ది కేసిఆర్‌కు మాత్రమే సొంతం. అది తెలంగాణ సాధనతోనే నిరూపితం. అందుకే ఆయన మనసంతా తెలంగాణనే కాదు, ఒళ్లంతా కళ్లు చేసుకొని మరీ తెలంగాణ సాధన కోసం శ్రమించారు. ప్రత్యర్ధులనుంచి వచ్చే ప్రతి బాణాన్ని ఎదుర్కొన్నారు. వాటికి సమాధానం చెప్పారు. తిరుగులేని శక్తి కేసిఆర్ అని కోట్లాది మందితో కొనియాడబడ్డారు…అదీ కేసిఆర్….
అదే కసి…అదే లక్ష్యం: ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనేది సినిమా డైలాగేమో! కాని దాని ఆచరణకు బ్రాండ్ అంబాసిడర్ కేసిఆర్…అలాంటి ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి తగ్గరు. పైగా రాజకీయ నిర్ణయాలలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఇప్పుడు కూడా అంతే…గతంలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్, తర్వాత చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్, ఎన్‌డిఏ( నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్)లలో కీలక భూమిక పోషించారు. కాని వాళ్లు ప్రధాన మంత్రులు కాలేకపోయారు. కింగ్ మేకర్‌ల పాత్రకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు కేసిఆర్ ఒక అడుగు ముందుకేసి, కేంద్రంలో కీలకపాత్ర పోషించి, ప్రధాని కూడా కావొచ్చేమో! అన్న ప్రచారం కూడా వున్నదే… దక్షిణాదినుంచి తొలి ప్రధాని పివి. తర్వాత తెలుగు వారికి ఆ అవకాశాలు ఎవరికీ రాలేదు. ఒక దశలో చంద్రబాబు పేరు ప్రస్తావన వచ్చినట్లు ప్రచారం జరిగింది. కాని అందులో నిజమెంత అన్నదానిపై ఎవరూ స్పష్టతనివ్వలేదు. కాకపోతే కేంద్రలో కీలకభూమిక మాత్రం పోషించారు. ఇప్పుడు మరోసారి కేంద్రంలో చక్రం తిప్పడమే కాదు, క్రియాశీల పాత్ర పోషించే అవకాశం మరోసారి దక్షిణాదికి వచ్చే వాతావరణం కనిపిస్తోంది.
అయితే ఈ మధ్యే ఎన్నో దశాబ్ధాల ఎదురుచూపుల తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్‌కు ఆ ఆశలు లేవు. ఆయన ఇప్పుడే కేంద్రంలో కీలకం కావాలన్న ఆలోచన లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా ఆ ఆలోచనల్లో లేరు. కర్ణాటక నుంచి కూడా పెద్దగా కేంద్రంలో తనదైన శైలి రాజకీయాలు చేసే నాయకులు లేరు. కాని మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబం వుంది. కుమార స్వామి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఒక వేళ భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల హవాతో కేంద్రంలో హంగ్ ప్రభుత్వాలే ఏర్పాటైతే కుమారస్వామికి కలిసివస్తే మాత్రం ఒకే ఇంట్లో ఇద్దరు ప్రధానులైన చరిత్ర , ఇందిరాగాంధీ కుటంబం తర్వాత చరిత్రకెక్కుతారు. కాని ఆ అవకాశం రాకపోవచ్చు. ఇక కేరళ సంగతి తెలిసిందే. సిపిఎం ఎప్పుడూ భాగస్వామ్యమే తప్ప, పాలనకు కేంద్రంలో సరిపోదు. ఇక మహా రాష్ట్ర నుంచి శరత్ పవార్ వున్నారు. ఎన్సీపీ నాయకుడు శరత్ పవార్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కలిస్తే కేంద్రలో తిరుగులేని శక్తిగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటౌతుందని చెప్పడంలో సందేహంలేదు. కేసిఆర్ మదిలో నిర్మితమౌతున్న ధర్డ్ ఫ్రంట్‌లో అత్యంత సీనియర్‌గా శరద్ పవార్ వుంటారు. ఆయనకు కూడా ప్రధాని అయ్యే ఛాన్సులున్నాయి. ఇక బెంగాల్ దీదీ గురించి తెలిసిందే…ఇటీవలే తేజస్వీ యాదవ్ బృందం కేసిఆర్‌ను కలవడం అన్నది జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైపోయింది. కేసిఆర్ తన రాజకీయ చాణక్యానికి పదును పెడుతున్నాడని తెలిసిపోయింది.
ఇక త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజేపి ప్రభావం తగ్గితే, ఇక వచ్చేందంతా ప్రాంతీయ పార్టీల హావానే అన్నది చెప్పకతప్పదు. అప్పుడు కేసిఆర్ మాత్రమే కీలకంగా మారక తప్పదు. అందుకే గత ఎన్నికల నుంచే బ్లూప్రింట్ రూపకల్పనతో కేంద్రం వైపు అడుగులు వేస్తూ, బాటలు ఏర్పాటు చేస్తున్న కేసిఆర్ ప్రచారం యూపిలో అత్యంత కీలకమౌతుందని అందరూ అనుకుంటున్నారు. ఏడేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన విజయాలు సాక్ష్యం ముఖ్యమంత్రి కేసిఆర్. ఆయన యూపిలో ఎస్పీకి మద్దతుగా కదిలితే, తెలంగాణ తరహాలో యూపి అభివృద్ధి ఎలా చేయాలన్నదానిపై ఎన్నికల ప్రచారంలో చెబితే ఇక ఎస్పీకి తిరుగుండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గడచిన ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో వున్న బిజేపిని , గత ఎన్నికల్లో యూపిలో అత్యధిక మెజార్టీతో గెలిపించినా జరిగిన ప్రగతి ఎంతో కళ్లముందు కనిపిస్తున్నదే. ఇక మరోసారి బిజేపిని నమ్మినా జరిగేదేమిటో ప్రజలకు తెలుసు. ఇలాంటి సమయంలో కేసిఆర్ రంగలోకి దిగి, తెలంగాణలో జరిగిన ప్రగతి, అమలౌతున్న సంక్షేమ పథకాలను యూపికి పరిచయం చేస్తే ఇక ఎస్సీకి తిరుగుండదు. యూపిలో ఎస్పీ గెలిస్తే భవిష్యత్తులో కేంద్రంలో కేసిఆర్‌కు ఎదురుండదు. ధట్సాల్…