Near Victory or Missed Opportunity for BJP?
సమీప విజయమా… లేక చేజారిన అవకాశం?
రామాయంపేటలో బీజేపీకి ఓట్ల జోరు – సీట్లలో మాత్రం చేదు అనుభవం..
రామాయంపేట ఫిబ్రవరి 19 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఓట్ల శాతంలో గణనీయమైన పెరుగుదల సాధించినప్పటికీ, సీట్ల పరంగా ఆశించిన ఫలితం రాకపోవడం భారతీయ జనతా పార్టీ శిబిరంలో మిశ్రమ స్పందనకు దారితీసింది. రాజకీయ విశ్లేషకుల మాటల్లో ఇది ఓటమి కాదని, “సమీప విజయాల పరంపర”గా చూడాల్సిన ఫలితమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎక్కడ తప్పింది…?
ప్రారంభం నుంచే నియోజకవర్గ ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ హోదా, బస్ డిపో నిర్మాణం, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి అభివృద్ధి అజెండాలతో ముందుకు వచ్చిన బీజేపీ, ప్రజల్లో చర్చ రేకెత్తించడంలో విజయవంతమైంది. గత ఎన్నికల్లో 4–5 శాతం వద్ద నిలిచిన ఓటు బ్యాంక్‌ను ఈసారి సుమారు 30 శాతానికి చేర్చుకోవడం చిన్న విషయం కాదు. కానీ ఆ ఓటు శాతం సీట్లుగా మారడంలో కీలక లోపం కనిపించింది.
పదో, రెండో, మూడో వార్డుల్లో కేవలం 16, 25, 35 ఓట్ల తేడాతో పరాజయం — ఇవే ఫలితాన్ని మలిచిన మలుపులు. ఆ మూడు సీట్లు దక్కివుంటే మున్సిపల్ పాలకవర్గంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే స్థితి ఏర్పడేది. కానీ చివరి నిమిషంలో మద్దతు సమీకరణాలు ఇండియా నేషనల్ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి వైపు మళ్లడం బీజేపీకి గట్టి దెబ్బగా మారింది.
వ్యూహంలో లోటా… లేక సమీకరణాల్లో మార్పా?

రాష్ట్ర నాయకత్వం ఫ్యాక్టర్
నియోజకవర్గ పునర్విభజన అంశంలో కేంద్ర మంత్రి G. కిషన్ రెడ్డి కమిటీ చైర్మన్‌గా ఉండటం, మెదక్ ఎంపీ M. రఘునందన్ రావు బీజేపీకి చెందినవారే కావడం పార్టీకి మానసిక బలాన్నిస్తోంది. “నియోజకవర్గం సాధన” అజెండాను మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం బీజేపీకి ఉంది.
అయినా సవాలు విసిరిందే….

కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా ఉన్న రామాయంపేటలో బీజేపీ ప్రతి వార్డులో పోరాట పటిమ ప్రదర్శించింది. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కసితో పనిచేసిన తీరు గమనార్హం. ఒకే సీటుతో సరిపెట్టుకున్నప్పటికీ, ఓట్ల శాతం గణనీయంగా పెరగడం రాబోయే రోజుల్లో పార్టీకి పునాది వేస్తుందనే విశ్లేషణ వినిపిస్తోంది.
ఇక ముందేమిటి?
నియోజకవర్గ ఏర్పాటు, రెవెన్యూ డివిజన్, బస్ డిపో నిర్మాణం — ఈ మూడు అంశాలపై ఉద్యమరేఖ గీసుకుని ముందుకు వెళ్లాలని బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. అధికార పక్షాన్ని నిలదీయడంలో, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయడంలో పార్టీ మరింత దూకుడు ప్రదర్శించనుంది.
రామాయంపేట ప్రజల కల — ప్రత్యేక నియోజకవర్గం.
దాన్ని ముందుగా సాధించేది ఏ పార్టీ?
సమాధానం రాబోయే రాజకీయ పరిణామాల్లో దాగి ఉంది.
ఓట్లలో ఊపు తెచ్చుకున్న బీజేపీకి ఇది హెచ్చరికా… లేక హెచ్చరికతో కూడిన అవకాశమా?
రామాయంపేట రాజకీయాలు ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెట్టాయి.
