Revanth Clarifies Remarks at Sevalal Jayanti
నేను రాజు.. నేనే మంత్రి వ్యాఖ్యలు వక్రీకరించారు: సీఎం రేవంత్
గిరిజనుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తండాలకు సోలార్ ప్లాంట్ల ద్వారా కరెంట్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని అన్ని తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రహదార్లు లేకుండా ఏ తండా ఉండకూడదన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని బంజారా భవన్లో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి లక్ష్మణ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనలో లంబాడా యువకులది ప్రత్యేక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 4 నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నానన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు.
