Apologize to Home Guards, Demands State Vice President Ashok Kumar
హోమ్ గార్డ్లను దూషిస్తే సహించేది లేదు జగ్గారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి!
రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ డిమాండ్
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత తూర్పు జగ్గారెడ్డి పోలీసు అధికారులపై, ముఖ్యంగా హోమ్ గార్డ్ సిబ్బందిపై ప్రదర్శించిన వైఖరిపై తెలంగాణ రాష్ట్ర హోమ్ గార్డ్స్ సంఘం నిప్పులు చెరిగింది. విధుల్లో ఉన్న సిబ్బందిని అత్యంత అసభ్యకర పదజాలంతో దూషించడం అమానవీయమని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు.సంగారెడ్డిలోని 34వ వార్డు పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు నియంత్రిస్తున్న క్రమంలో జగ్గారెడ్డి అక్కడకు చేరుకుని తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఇన్స్పెక్టర్ శివకుమార్‌ను దూరం తోసేస్తూ, ఒక హోమ్ గార్డును ఉద్దేశించి “అమ్మకు అయ్యకు పుట్టి ఉంటే రారా..” అంటూ అత్యంత దారుణమైన పదజాలంతో దూషించారు. “నిన్ను చూస్తా.. పోలింగ్ ఆపేస్తా” అంటూ విధులకు ఆటంకం కలిగిస్తూ జగ్గారెడ్డి చేసిన హెచ్చరికల వీడియోలు సోషల్ మీడియాలో దావాగ్నంలా వ్యాపించాయి.ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం:
ఈ ఘటనపై స్పందించిన అశోక్ కుమార్.. “సమాజ భద్రత కోసం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే హోమ్ గార్డులను గౌరవించాల్సింది పోయి, ఇలా బహిరంగంగా బూతులు తిట్టడం రాజకీయ నాయకులకు తగదు. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదు, మొత్తం హోమ్ గార్డుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి” అని ఆవేదన వ్యక్తం చేశారు.జగ్గారెడ్డి తన ప్రవర్తనకు తక్షణమే హోమ్ గార్డులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోమ్ గార్డ్స్ సంఘాలన్నింటినీ ఏకం చేసి, ప్రభుత్వంపై మరియు జగ్గారెడ్డిపై బలమైన పోరాటం చేస్తామని, ఆయనకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసు సిబ్బందిని కించపరచడం మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు.
