దళితుల భూ సమస్యపై మంత్రి ఎర్రబెల్లి మౌనం వీడాలి : కేవీపీఎస్

పాలకుర్తి:(జనగామ) నేటిధాత్రి
మండలంలోని మంచుప్పుల గ్రామానికి చెందిన దళితుల భూములు స్ధానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు తెలియకుండానే కబ్జాకు గురై అక్రమ రిజిస్ట్రేషన్ లు అయ్యాయా అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జాటోత్ ఇందిరలు మండిపడ్డారు. దళితులను ఆదుకుంటామని ఎన్నికల లో మాయ మాటలు చెప్పి దళితుల ఓట్లను వేయించుకోని ఇప్పుడు దళితుల భూములను కబ్జా చేస్తున్న అధికార పార్టీ నాయకులకు అండగా ఉంటూ ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండడంలో మతలబేంటో చెప్పాలని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దళిత ద్రోహిఅని అన్నారు. దళితుల భూ సమస్యపై మంత్రి ఎర్రబెల్లి మౌనం వీడాలని డిమాండ్ చేశారు.

దళితుల భూములను కబ్జా దారులకు కట్టబెట్టిన తహశీల్దార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం పాలకుర్తి మండలకేంద్రములో గత 8 రోజులుగా తమ పట్టా భూములకు రక్షణ కల్పించాలని దీక్షలు చేస్తున్న దళితుల పోరాటానికి సంఘీభావంగా మండల కేంద్రములో కేవీపీఎస్ ఆధ్వర్యములో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్ధార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఇండ్ల స్థలాల పోరాట నాయకులకు పూలదండలు వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టా కాగితాలు వున్న 52 దళిత కుటుంబాలకుఇండ్ల స్థలాల భూమినికబ్జా కోరులకు కట్టబెట్టిన తహశీల్ధార్ విజయభాస్కర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని దళితుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే జోక్యం చేసుకొని దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 1993 లో ప్రభుత్వం దళితుల 52 కుటుంబాలకు ఇండ్ల స్థలాల కోసం ఆనాటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూమిని ప్రస్తుత సర్పంచ్, ఉప సర్పంచ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తో కుమ్మక్కై కబ్జా చేశారని, తక్షణమే ఆ భూమిని ఇప్పించాలని తహశీల్ధార్ ను డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల కోసం పట్టాలు పంపిణీ చేసిన భూములను హద్దులు నిర్ణయించి దళితులకు ఇవ్వాలన్నారు.

రెవిన్యూ అధికారులు వైఫల్యం వల్ల దళితులకు అన్యాయం జరిగిందన్నారు తహశీల్ధార్ నలుగురికి అక్రమ పట్టాలు చేయడం శోచనీయమన్నారు ఫలితంగా భూమి కబ్జా అయిందని అన్నారు. ఇప్పుడు అధికారులు కబ్జా దారులకు అనుకూలంగా మాట్లాడటం ఆందోళన కరం అన్నారు. ఈ భూమి లో సగం డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఇచ్చిందన్నారు నిర్మాణం అయిన తర్వాత ఆ ఇండ్లు బిసి లకు ఇస్తాం, ఎస్సీ లకి ఇవ్వమని అధికారులు అనడం కులవివక్ష ను అమలు చేయడమే అన్నారు. పట్టాలు వున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇండ్లు ఇవ్వమని చెప్పడం అట్టుడుకు పేదలను మోసం చేయడమే అన్నారు.

ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు తూటి దేవదానం,బొట్ల శేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పల్లెర్ల లలిత, టిడీపీ మండల అధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న, జిల్లానాయకులు యాదగిరి, బహుజన కులాల ఐక్య వేదిక వ్యస్థాపక అధ్యక్షులు గుమ్మడిరాజుల సాంబయ్య,ద్రవిడ బహుజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు చేరిపల్లి ఆనంద్,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, ఘనపురం ఎల్లయ్య,పసలాది ఉపేందర్,భూపోరాట నాయకులు రమేష్ బాబు, వెంకన్న,ఎల్లమ్మ,యాకమ్మ, లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!