Municipal Election Code Announced in Zaheerabad
మున్సిపల్ కోడ్ కూసింది.. ఆరేళ్ళ సందిగ్ధతకు తెరపడింది..!
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల
నగారా మోగింది. దీంతో ఎన్నికలపై జహీరాబాద్ ప్రజల్లో నెలకొన్న సందిగ్ధత తొలిగిపోయింది. మున్సిపాలిటీతో పాటు విలీన గ్రామాలతో కలిపి 37 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొంటున్న గ్రామ నేతలు, ప్రజలతో పాటు మున్సిపల్ వాసుల్లో కూడా ఆనందోత్సవం కనిపిస్తుంది.
అధిక పోటీ
కౌన్సలర్ పదవికి పోటీ ఎక్కువ ఉండడంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు తలనొప్పిగా మారింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. మున్సిపాలిటీలోని 37 వార్డులకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి సుమారు 200 పైగా అభ్యర్థులు పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 37 మందిని ఎంపిక చేసి బరిలో దింపాల్సి ఉంది. అయితే మిగతావారు రెబల్స్ గా బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే ప్రధాన పార్టీల గెలుపోటములు రెబల్స్ పైన ఆధారపడి ఉంటుందన్న భయం పార్టీలను వెంటాడుతుంది.
