Human Rights Protection Call by INHRPC Telangana Chairman
మానవ హక్కులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి
◆-: ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాద్:సమాజంలో ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు మానవ హక్కుల మూల సూత్రమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు అన్నారు.
ఆదివారం హైదరాబాద్ లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ 2026 క్యాలెండర్ ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యం నిలకడగా కొనసాగాలంటే మానవ హక్కుల పరిరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు.ప్రతి పౌరుడికి జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, న్యాయం పొందే హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని ఆయన గుర్తు చేశారు. అయితే సమాజంలో ఇప్పటికీ పేదలు, మహిళలు, బాలలు, దళితులు, గిరిజనులు, కార్మికులు, వృద్ధులు అనేక సందర్భాల్లో హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మానవ హక్కులు కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదని, అవి మానవత్వానికి ప్రతీకలని అన్నారు. ఇతరుల హక్కులను గౌరవించడం ద్వారా మాత్రమే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. మానవ హక్కులపై అవగాహన లేకపోవడం వల్లనే అనేక అన్యాయాలు జరుగుతున్నాయని, అందుకే గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంస్థ దేశవ్యాప్తంగా హక్కుల ఉల్లంఘనలపై పోరాటం చేస్తూ, బాధితులకు న్యాయం అందించేందుకు కృషి చేస్తోందని వివరించారు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ వ్యవస్థల వద్ద బాధితులకు సహాయం అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, యువత అందరూ కలిసి మానవ హక్కుల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు తన హక్కులపై అవగాహన పెంచుకోవడంతో పాటు, ఇతరుల హక్కులను కూడా గౌరవించే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు.న్యాలకల్ మండలం మల్గి గ్రామంలో ప్రజలకు నష్టం కలిగించే కంపెనీ ఏర్పాటు జరగకుండా సంస్థ తరపున గట్టి పోరాటం చేశామని , గ్రామ ప్రజల భద్రత, జీవనాధారాలను కాపాడాలనే ఉద్దేశంతో సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు.అలాగే సిగచి కంపెనీ ప్రమాదంలో గాయపడిన 53 మంది బాధితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సంస్థ పోరాటం చేసిందని, ఆ క్రమంలో ప్రతి బాధిత కుటుంబానికి రూ. లక్ష చొప్పున పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.భవిష్యత్తులో కూడా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ అంశమైనా ఎదురైతే సంస్థ తరపున పోరాటం కొనసాగిస్తామని, ప్రజల పక్షాన నిలబడి హక్కుల సాధన కోసం ముందుండి పోరాడతామని వారు స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని నవోదయ సిద్దు కోరారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలమని తెలిపారు. ప్రత్యేకంగా ప్రజలు తమ హక్కులు, విధులు తెలుసుకొని న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది చీఫ్ అడ్వైజర్ పుట్ట పద్మారావు, జేఎన్జీఓయూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు బిట్ల ప్రభాకర్, బి. క్రాంతి కిరణ్, ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ అడ్వైసర్ వెంకట్ దాస్, ప్రొఫెసర్ సీబీఐటి చీఫ్ అడ్వైసర్ ఎం. స్వామి దాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వి మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శులు దత్తా రెడ్డి, ఆనంద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తలారి కుమార్, రాష్ట్ర అడ్వైజర్ ప్రశాంత్ గాంధీ, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఫెరోజ్, సహాయ కార్యదర్శులు ఏ. ప్రదీప్ కుమార్, ఆందోల్ మల్లేశం, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్, బోరంచ సాయిలు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.ఏ ఖైసర్ తదితరులు పాల్గొన్నారు
