కోటగుళ్లలో కాకతీయుల కుడ్యచిత్రాలను సంరక్షించాలి
మూడు రోజులపాటు టార్చ్ ఆధ్వర్యంలో చిత్రాల పరిశీలన
కుడ్యచిత్రాలను భావితరాలకు అందించాలని టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య విజ్ఞప్తి
టార్చ్ ఆధ్వర్యంలో పురావస్తు శాఖ ఉన్నతాధికారులకు లేఖలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల చారిత్రక సంపద కోటగుళ్లు ఆలయంలో ఉన్న సుమారు 800 ఏళ్ల నాటిఅరుదైన కుడ్యచిత్రాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీం ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ హెరిటేజ్ (టార్చ్) కార్యదర్శి చరిత్రకారుడు అరవింద్ ఆర్య అన్నారు. గత మూడు రోజులుగా కోటగుళ్ళు ఆలయ సముదాయాల్లో కుడ్య చిత్రాలను టార్చ్ ఆధ్వర్యంలో నలుగురు బృందం పరిశీలించి ఫోటోలు వీడియోలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా అరవింద్ ఆర్య మాట్లాడుతూ శిల్ప సంపద నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆలయ రాతి దూలాలు, పైకప్పు పలకలపై సహజ రంగులతో చిత్రించిన నర్తకులు, కిన్నెరలు, హంసలు వంటి దృశ్యాలు నేటికీ కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కాలక్రమంలో వాతావరణ ప్రభావాలు, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల ఈ చిత్రాలు మసకబారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కుడ్య చిత్రాలకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. కోటగుళ్లలోని కాకతీయ కాలపు కుడ్యచిత్రాలను శాస్త్రీయ పద్ధతుల్లో పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురావస్తు శాఖను కోరారు.
కాకతీయుల పాలనా కాలం తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని వారి వారసత్వానికి ఈ కుడ్యచిత్రాలు కీలక ఆధారాలని అరవింద్ ఆర్య తెలిపారు. శిల్పకళతో పాటు చిత్రలేఖనంలో కూడా కాకతీయులు ఎంత నిష్ఠాతులో ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన అన్నారు. సరైన పరిరక్షణ లేక ఇప్పటికే 90 శాతం చిత్రాలు పాడయ్యాయని , వీటిని తక్షణం కాపాడాల్సిన అవసరం ఉందని ఈ విషయమై పురావస్తు శాఖ డైరెక్టర్‌కు లేఖ ద్వారా వినతి చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కోటగుళ్లలోని ఈ అమూల్యమైన కుడ్యచిత్రాలను కాపాడితే, భవిష్యత్ తరాలకు కాకతీయుల కళా వైభవాన్ని అందించినట్లవుతుందని అరవింద్ ఆర్య అన్నారు. ఈ పరిశోధనలో తాళ్ల పెళ్లి నందకిషోర్, అరుణ్ కుమార్ నలిమెల , నవీన్,లు పాల్గొన్నారు.
