మేడారం తల్లుల దర్శనానికి పాదయాత్రగా బయలుదేరిన భక్తజనులు
#నెక్కొండ, నేటి ధాత్రి:
మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లులపై అచంచలమైన భక్తితో వరంగల్ ఉమ్మడి జిల్లా, ప్రస్తుత మానుకోట జిల్లా తొర్రూర్ నుంచి భక్తజనులు పాదయాత్రగా మేడారం వైపు ప్రయాణం ప్రారంభించారు. ఈ పాదయాత్ర బృందం వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ప్రజలకు, భక్తి భావంతో దర్శనమిచ్చారు.ప్రతి ఏటా ఆనవాయితీగా కొనసాగుతున్న ఈ పాదయాత్రను ఈ సంవత్సరం కూడా గురువారం 22వ తేదీ నుంచి ప్రారంభించగా, సోమవారం 26వ తేదీన మేడారం చేరుకోనున్నట్లు పాదయాత్రకు సమన్వయం వహిస్తున్న కూరపాటి కామారాజు తెలిపారు.
ఈ పాదయాత్రలో స్త్రీలు, పురుషులు కలిపి సుమారు 300 మంది భక్తులు గ్రూపులుగా బయలుదేరగా, ఒక్కో గ్రూపులో సుమారు 45 మంది భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు. పూర్వీకుల కాలం నుంచే తమ కుటుంబాల్లో కొనసాగుతున్న సంప్రదాయంగా ప్రతి జాతర సమయంలో పాదయాత్రగా వెళ్లి తల్లుల దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పాదయాత్రలో హస్తం వెంకన్న, తిరుపటి శ్రీనివాస్, కిన్నెర మోహన్, హస్తం వెంకటమ్మ, తిరుపటి శైలజ, లక్ష్మి, సారమ్మ, ధనమ్మ, సుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు, యువకులు, యువత సమాన ఉత్సాహంతో మేడారం తల్లుల దర్శనానికి పాదయాత్రగా సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భక్తి, విశ్వాసం, సంప్రదాయాల సమ్మేళనంగా ఈ పాదయాత్ర భక్తుల హృదయాలను కదిలిస్తోంది.
