రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని
భూపాలపల్లి నేటిధాత్రి
దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో 4వ స్థానంలో ఉన్నప్పటికీ, రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉండటం ఆందోళనకరమని జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు గత 37 సంవత్సరాలుగా వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదని పేర్కొన్నారు. అందుకే నెల రోజుల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బుధవారం మంజూరు నగర్‌లోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలల్లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం–2026 సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మీ ద్వారా తల్లిదండ్రులకు కూడా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులను సూచించారు. నడిచేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
మోటారు సైకిళ్ల ద్వారానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలిపారు. సక్రమంగా వెళ్లకపోవడం, అశ్రద్ధ, సెల్‌ఫోన్ మాట్లాడుతూ నడవడం లేదా వాహనం నడపడం, జిగ్‌జాగ్‌గా వెళ్లడం, అతివేగం వంటి కారణాల వల్ల వాహనం నడిపే సమయంలో ధ్యాస లేక ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు.
ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులచే రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిపిఆర్వో శ్రీనివాస్,కళాశాల ప్రిన్సిపాల్ రవి, ఏఎంవిఐలు శ్రీనివాస్, సుందర్ లాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
