సీఎం కప్ పోటీలు యువతలో క్రీడా ప్రతిభకు దోహదపడతాయి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
సీఎం కప్ పోటీలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని, శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ సార్ విగ్రహం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జిల్లా యువజన క్రీడల శాఖ సిహెచ్ రఘు ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ టార్చ్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం టార్చ్ ను వెలిగించి, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీ లో పాల్గొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒలింపిక్స్ లో దేశం నుంచి ఎక్కువ సంఖ్యలో పతకాలు సాధించాలనే ఉద్దేశ్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. సీఎం కప్ పేరిట రాష్ట్రంలోని గ్రామ స్థాయి నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీసి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వివిధ క్రీడా విభాగాల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి షెడ్యూల్ ప్రకారం పోటీలు నిర్వహిస్తుందని వివరించారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు, శిక్షణ అందిస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తుందని, యువత, విద్యార్థులకు ఉత్తమ శిక్షణ, ఉపాధి కల్పించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి డిఇఓ రాజేందర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు
