నెక్కొండ వ్యవసాయ కార్యాలయానికి నూతన శోభ
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం గత నాలుగు దశాబ్దాలుగా సున్నం కూడా చూడని స్థితిలో బూజు పట్టిన గోడలతో నిర్లక్ష్యానికి గురై ఉండేది. అలాంటి కార్యాలయంలోనే వ్యవసాయ అధికారులు విధులు నిర్వర్తిస్తూ రావడం గమనార్హం.
ఈ పరిస్థితిని గమనించిన ప్రస్తుత మండల వ్యవసాయ అధికారి నాగరాజు కార్యాలయానికి నూతన రూపు కల్పించారు. కార్యాలయానికి రంగులు వేయించి, లోపల నీటితో శుభ్రంగా కడిగి, సర్వాంగ సుందరంగా అలంకరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పూలదండలతో అలంకరించి, గుమ్మడికాయ కొట్టి, కొబ్బరికాయలు కొట్టి కార్యాలయాన్ని పండుగ వాతావరణంతో కళకళలాడేలా తీర్చిదిద్దారు.
నూతన శోభతో కళకళలాడుతున్న కార్యాలయంలో వ్యవసాయ సేవలు అందించడం రైతులకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా శుభ్రత, ఆత్మీయతతో ఉంటే ప్రజలకు మరింత చేరువ అవుతాయనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందిస్తోంది.
