Velichala Rajender Rao Appointed Karimnagar Congress Incharge
కాంగ్రెస్ పార్టీ నూతన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వెలిచాల
కరీంనగర్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావు నియమితుల య్యారు. ఈమేరకు శనివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాజేందర్ రావుకు నియోజకవర్గ ఇన్చార్జి నియమానికి సంబంధించి లేఖను అందించారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఇతర కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు, నేతలతో పాటు ప్రతి ఒక్కరికి పేరుపేరునా రాజేందర్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు అధిష్టానం పెద్దలు తనపై అతిపెద్ద బాధ్యతను అప్పగించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైనికుడి వలె కష్టపడి పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రతి పల్లె పల్లెనా ప్రతి వార్డు వార్డునా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. కరీంనగర్లో డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇతర నాయకులు అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కరీంనగర్ కార్పొరేషన్ పై జెండా ఎగరవేస్తామని రాజేందర్రావు ధీమా వ్యక్తం చేశారు. రాజేందర్ రావ్ ను అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించడంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, రాజేందర్ రావ్ నియామకంతో కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు వెలిచాల అభిమానులు సన్నిహితులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఇక కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని రాబోయే రోజుల్లో రాజేందర్ రావు నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలో బ్రహ్మాండంగా పార్టీ ముందుకు సాగుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
