Bhutan – A Land of Peace and Nature
ప్రకృతి చెక్కిన ప్రశాంత నిలయం ‘భూటాన్’…
భూటాన్లో సంతాన భాగ్యం కలిగించే బౌద్ధ సన్యాసి ఉండేవాడు. ఆయన పేరు దృక్ప కుంలెయ్. మిగతా సన్యాసులు అనుసరించే మార్గానికి భిన్నంగా ఉండేవాడట. అందుకే మిగిలిన లామాలు అతనిని సీరియస్గా తీసుకునేవారు కాదు.
మా భూటాన్ ట్రిప్ 24 అక్టోబర్ 2025న మొదలయ్యింది. బాడ్ డోగ్రా విమానాశ్రయం నుంచి క్యాబ్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి జయగావ్ చేరేసరికి సాయంత్రం 5 గంటలయ్యింది. అక్కడ గైడ్ మమ్మల్ని పికప్ చేసుకుని ఇమ్మిగ్రేషన్ చేయించారు. గంట సమయం పట్టింది. అక్కడి నుంచి రాత్రి 12 గంటలకు భూటాన్ రాజధాని థింపూలోని హోటల్కి చేరాం. జయగావ్ నుంచి థింపూ వరకు హిమాలయ పర్వతాలలో నిర్మించిన రహదారిలో ప్రయాణం గొప్ప అనుభూతినిచ్చింది.
మరునాడు ఉదయం 8 గంటలకు హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి, థింపూ సందర్శనకు బయలుదేరాం. మొదటగా అక్కడ ఉన్న దుర్గామాత ఆలయాన్ని దర్శించాం. అక్కడ నుంచి శాక్యముని బుద్ధుడి ‘బుద్దా డోర్డెన్మా’ కు వెళ్లాం. ఇక్కడ కొండ మీద బుద్ధుడి విగ్రహం 180 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ విగ్రహానికి బంగారు పూత పూశారు. బొట్టు దగ్గర వజ్రం పొదిగారు. అక్కడి నుంచి భూటాన్ మ్యూజియానికి చేరుకున్నాం. మ్యూజియంలో భూటాన్వాసులు వంటలు చేేస విధానం, పూర్వకాలపు పాత్రలు, వస్త్రధారణ మొదలైనవి ఉన్నాయి. బియ్యం నుంచి సారాయి తయారు చేేస విధానం చూపించారు. వాళ్ళు యాక్ జంతువు పాలతో చేసిన ఛీజ్ను వాడతారని చెప్పారు.
