Three Kg Ganja Seized, Two Arrested
మూడు కిలోల ఎండు గంజాయి స్వాధీనం
ఇద్దరు వ్యక్తుల అరెస్ట్..ఆటో సీజ్.. రెండు మొబైల్ స్వాధీనం
దుగ్గొండి ఎస్ఐ రావుల రణధీర్ రెడ్డి
దుగ్గొండి,నేటిధాత్రి:
నర్సంపేట డివిజన్ లో మరోసారి గంజాయి కలకరం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వరంగల్ కు ఆటోలో సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను దుగ్గొండి పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో జరిగింది.దుగ్గొండి ఎస్ఐ రావుల రణధీర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలానికి చెందిన మర్రి సాయితేజ,జి. కృష్ణారెడ్డిలు టీజీ 25 టీ 4560 నంబర్ గల ఆటోలో భద్రాచలం నుండి వరంగల్ కు గంజాయి సరఫరా చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి వరంగల్ -నర్సంపేట ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఆటోను వెనక్కి తిప్పుకొని పారిపోయే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అనుమానంతో ఆటోను తనిఖీ చేయగా మూడు కిలోల ఎండు గంజాయి లభ్యమైందని తెలిపారు.
ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఆ దొరికిన గంజాయితో పాటు ఆటోను, 2 మొబైల్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. ఎండు గంజాయి సరఫరా పట్ల పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు.
