Free Eye Checkup Camp for Drivers in Warangal
రహదారి భద్రత మాసోత్సవం–2026లో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
వరంగల్, నేటిధాత్రి:
రహదారి భద్రత మాసోత్సవం–2026 కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం (04-01-2025) రవాణా శాఖ కార్యాలయంలో హెవీ గూడ్స్ వెహికల్స్, మీడియం గూడ్స్ వెహికల్స్ డ్రైవర్లు మరియు ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO), వారి సిబ్బంది పర్యవేక్షణలో ఈ పరీక్షలు చేపట్టగా, దాదాపు 150 మంది డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు.

వయసు పెరిగేకొద్దీ దూరదృష్టి లోపించడం వల్ల రోడ్డు ప్రమాదాల ప్రమాదం పెరుగుతుందనే అంశంపై డ్రైవర్లకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. కంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఎస్. శోభన్ బాబు, ఏఎంవిఐ ఉదయ్ కుమార్, రవాణా శాఖ సిబ్బంది, అలాగే డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రహదారి భద్రతకు డ్రైవర్ల ఆరోగ్యం కీలకమని, ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.
