Tribute to Telangana Freedom Fighter Baddam Ellareddy
సంకెళ్ళతో ఊరేగించినా,జైల్లో నిర్భందించినా వెనకడు వేయని ధీరుడు,తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన సేనాని, ఎంపిగా, ఎమ్మెల్యేగా,రాజ్యసభ సభ్యుడిగా పేదలకు విశిష్ట సేవలు అందించిన గొప్ప నేత బద్దం ఎల్లారెడ్డి-సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
భారత దేశానికి స్వాతంత్ర్యం కావాలని స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుల పరిపాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నిర్వహిస్తున్న బద్దం ఎల్లారెడ్డిని సంకెళ్లతో ఊరేగించినా, జైల్లో నిర్బంధించిన మొక్కవోని ధైర్యంతో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సేనాని, కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంటు సభ్యులుగా, బుగ్గారం ఇందుర్తి శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా పేద బడుగు బలహీన వర్గాలకు విశిష్ట సేవలు అందించిన గొప్ప నాయకుడు బద్దం ఎల్లారెడ్డి అని సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. బద్దం ఎల్లారెడ్డి నలభై ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నగరంలోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డులో గల బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్,జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ లతో కలిసి చాడ వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం నవాబు ను, రజాకార్లను,దేశ్ ముఖ్ లను ఎదిరించడానికి, వెట్టి చాకిరి,బానిసత్వం,దోపిడీకి వ్యతిరేకంగా దున్నే వానికి భూమి కావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన గొప్ప యోధుడు పోరాట సేనాని బద్దం ఎల్లారెడ్డి అని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామంలో జన్మించిన బద్దం ఎల్లారెడ్డి దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేస్తున్న సత్యాగ్రహానికి ఆకర్షితుడై స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని జైలుకెళ్లాడని, నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నాడని, సంకెళ్ళతో బంధించి ఊరేగించారని ఆనాటి కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు రావి నారాయణరెడ్డి, మగ్ధుo మోహియుద్దిన్ లాంటి వారితో కలిసి ఆంధ్ర మహాసభ,కమ్యూనిస్టు పార్టీ లో కీలకం నేతగా పనిచేశారని, నిజాం నవాబుల అరాచకాలను ఎదిరించడానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని, అనాటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై వేలాదిమంది రజాకారులకు,దేశముఖ్ లకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలంటే వారికి అండగా ఎల్లారెడ్డి లాంటి నాయకులు ఉండడమేనన్నారు. ఆమహత్తర పోరాటం మూలంగా మూడువేల గ్రామాలు విముక్తి అయ్యాయని, నాలుగు వేల ఐదు వందల మంది అమరులయ్యారని, పది లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచడానికి బద్దం ఎల్లారెడ్డి అగ్రభాగాన నిలిచాడని, భారతదేశంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంట్ సభ్యులుగా బద్దం ఎల్లారెడ్డి ఎన్నికయ్యారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇందుర్తి, బుగ్గారం శాసనసభ్యులుగా పని చేశారని, రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేసి ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గొప్ప నాయకుడని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి బద్దం ఎల్లారెడ్డి అని,అలాంటి నాయకుడి ఆశయాలను, లక్ష్యాలను నేటి తరం పునికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్లేందుకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నివాళులర్పించిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్,జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు పైడిపల్లి రాజు, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, మచ్చ రమేష్, కొట్టే అంజలి, బోనగిరి మహేందర్, నగర నాయకులు గామినేని సత్యం, కసిబోజుల సంతోష్ చారి,మాడిశెట్టి అరవింద్,బాకం ఆంజనేయులు, నగునూరి రమేష్, బెక్కంటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
