Grand Celebration of Singareni 137th Foundation Day
ఘనంగా సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక సింగరేణి అని, బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్ర, దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలకపాత్ర పోషిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం సింగరేణి కాలరీస్ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో భూపాలపల్లి ఏరియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు కార్మికులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. జీఎం కార్యాలయ ప్రాంగాణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే, జీఎం పూల వేసి నివాళులర్పించి, జెండావిష్కరణ చేశారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన కేకు కోసి వేడుకలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సింగరేణి సంస్థ వెన్నెముకలా నిలుస్తుందని, కార్మికుల కష్టానికి తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సింగరేణి సంస్థ ఆధునికీకరణ, సాంకేతిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సింగరేణి మరింత ప్రగతి సాధించేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ సుస్థిర భవిష్యత్తు కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రమశక్తిని చాటుతూ సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ఎమ్మెల్యే శాలువాలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు
