Dalit Leadership Marks New Chapter in Village Politics
దళితులకు పెద్ద పీట… ఆదర్శ రాజకీయాలకు నాంది
నర్సింహుల గూడెం సర్పంచ్‌గా పోలేపల్లి శివశంకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
దళితులకు పెద్ద పీట… ఆదర్శ రాజకీయాలకు నాంది
ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అందరూ దళితులే!!
నేటి ధాత్రి అయినవోలు:-
నర్సింహుల గూడెం గ్రామంలో ఆదర్శ రాజకీయాలకు నాంది పలికిన సంఘటనగా పోలేపల్లి శంకర్ రెడ్డి సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిలిచింది. సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులుగా అంతా దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులే ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయడం గ్రామ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టంగా మారింది.
సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, సామాజిక న్యాయం–సమానత్వం అనే మూల సూత్రాలను ముందుకు తెచ్చే విధంగా సర్పంచ్ శంకర్ రెడ్డి వ్యవహరించిన తీరు ప్రజల్లో విశేష స్పందనను రాబట్టింది. గ్రామ పాలనలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, వారిని నిర్ణయాధికార స్థానాల్లో నిలబెట్టడం ద్వారా సమాజంలో సమాన అవకాశాల దిశగా బలమైన అడుగు పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ,
“గ్రామ అభివృద్ధి అందరిదీ. కులాలు, వర్గాలు అనే తేడా లేకుండా నర్సింహుల గూడెాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. పాలనలో దళితుల భాగస్వామ్యం పెరగడం సామాజిక మార్పుకు నాంది” అని తెలిపారు.
గ్రామంలో మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, విద్య, మహిళా సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే గ్రామపంచాయతీ నిర్ణయాలు పారదర్శకంగా, ప్రజల భాగస్వామ్యంతో తీసుకుంటామని హామీ ఇచ్చారు.సర్పంచ్ శంకర్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ఈ పాలక మండలి, దళిత సాధికారతకు మాత్రమే కాకుండా గ్రామాభివృద్ధికి కూడా దిశానిర్దేశం చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలపడుతోంది. నర్సింహుల గూడెం గ్రామం రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలవాలన్న ఆకాంక్షతో ప్రజలు ఈ కొత్త పాలనపై ఆశలు పెట్టుకున్నారు.
