Jitesh Sharma’s Warm Words on Sanju Samson Amid T20 World Cup 2026 Battle
సంజూ నాకు పెద్దన్నలాంటోడు.. జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
టీ20 ప్రపంచ కప్ 2026 దగ్గర పడుతున్న సమయంలో టీమిండియా సన్నాహక పోరు ప్రారంభించింది. తుది జట్టులో వికెట్ కీపింగ్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ పోటీ పడుతున్నారు. సౌతాఫ్రికాతో తొలి టీ20 గెలిచిన తర్వాత సంజూపై జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి ఇప్పటికే సన్నాహక మ్యాచులు ప్రారంభమయ్యాయి. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తుంది. ఈ క్రమంలో తొలి టీ20లో సెలక్టర్లు జితేశ్ వైపే మొగ్గు చూపడంతో.. సంజూ తుది జట్టులో స్థానం పొందలేకపోయాడు. ఈ మ్యాచులో జితేశ్ శర్మ(Jitesh Sharma) అద్భుతమైన కీపింగ్ చేశాడు. ఏకంగా నాలుగు క్యాచులు అందుకుని జట్టులో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాట్‌తోనూ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్ అనంతరం జితేశ్ శర్మ.. తనకు, సంజూ శాంసన్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి మాట్లాడాడు. ‘అతడు జట్టులో ఉన్నందుకు ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే సంజూ నాకు పెద్దన్న లాంటోడు. మా మధ్య పోటీ ఉన్న మాట వాస్తవం.. కానీ అప్పుడే మనలో దాగున్న ప్రతిభ బయటకు వస్తుంది. ఇది జట్టుకు కూడా ఎంతో మంచిది. సంజూ అద్భుతమైన ఆటగాడు. మేమిద్దరం టీమిండియా తరఫున ఆడుతున్నాం. మేం సోదరుల్లాంటివారం. అతడు నాకు చాలా సాయం చేశాడు’ అని జితేశ్ శర్మ అన్నాడు.
