Mastering Technology is the Step to Success - Pravesh Sharma
సాంకేతిక పరిజ్జానంపై పట్టు – విజయానికి మెట్టు
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన సింక్రొనీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ హెడ్ ప్రవేష్ శర్మ
నేటి ధాత్రి, పఠాన్ చేరు
విద్యార్థులకు అభిరుచి ఉన్న ఒక సాంకేతిక పరిజ్జానంపై పట్టు సాధించడం వల్ల కొత్త వాటికి అనుగుణంగా సులువుగా మారవచ్చని, త్వరగా నేర్చుకోవచ్చని సింక్రొనీలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ హెచ్ ప్రవేష్ శర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఈఈసీఈ విభాగం విద్యార్థులతో ‘వైర్ లెస్ నెట్ వర్కులలో భద్రతా సవాళ్లు, సాంకేతికతలు’ అనే అంశంపై ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.విద్యార్థి జీవితం నుంచి అనుభవజ్జుడైన వృత్తినిపుణుడిగా తన ప్రయాణం యొక్క స్ఫూర్తిదాయకమైన కథనంతో ప్రారంభించి, విద్యార్థులను ప్రశ్నలు అడమని ప్రోత్సహించడమే గాక, చురుకుగా ఉండడం, స్పష్టత కోసం వారిని ప్రేరేపించారు. అభివృద్ధి, రూపకల్పన, విస్తరణ వరకు – సాంకేతికత యొక్క మొత్తం జీవితచక్రంలో భద్రత యొక్క ప్రాముఖ్యతను శర్మ నొక్కి చెప్పారు.సైబర్ భద్రత వేగంగా విస్తరిస్తోందని, ప్రభుత్వ రంగంతో పాటు మంచి కెరీర్ అవకాశాలు, అధిక వేతనంతో కూడిన మంచి డిమాండ్ ఉన్న రంగమని ప్రవేష్ శర్మ తెలియజేశారు. విద్యార్థులు ఇష్టంతో నేర్చుకోవాలని, విస్తృతంగా అధ్యయనం చేయాలని, ఈ రంగంలో రాణించాలనే ఆసక్తిని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.డేటా సైన్స్, కృత్రిమ మేధస్సులతో సంభవిస్తున్న ప్రధాన మార్పును శర్మ అంచనా వేస్తూ, అభివృద్ధి చెందుతున్న ఐటీ ల్యాండ్ స్కేప్ పై లోతైన అవగాహన కల్పించారు. సాంకేతిక పరిజ్జానాలను నిరంతరం నేర్చుకోవడం, కొన్నింటిని వదిలేయడం కూడా అవశ్యమన్నారు. సంచార్ సాథీ యాప్ పై ఒక ప్రశ్నకు జవాబిస్తూ, ప్రజలకు సమర్థవంతమైన డిజిటల్ భద్రతా చర్యలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రవేష్ శర్మ వివరించారు. డిజిటల్ సాంకేతికతపై అంతగా అవగాహన లేని సామాన్య ప్రజలను సైబర్ బెదిరింపులకు గురిచేస్తున్నట్టు ఆయన గుర్తించారు. సైబర్ భద్రతా సంఘటనలు, సైబర్ దాడులను నివారించడంలో ముందస్తుగా గుర్తించడం చాలా కీలకమని ఆయన స్పష్టీకరించారు.గీతం అక్రిడిటేషన్, ర్యాంకింగ్ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. మంజునాథాచారి అతిథిని విద్యార్థులకు పరిచయం చేయగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ షేక్ జానీ బాషా వందన సమర్పణ చేశారు. ఈఈసీఈ విభాగం ప్రొఫెసర్ చెన్నుపాటి సుమంత్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
