Boy Climbs Tower After Love Rejection
పెళ్లికి నో చెప్పిన ప్రియురాలు.. యువకుడు ఏం చేశాడంటే..
ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదన్న బాధతో ఓ యువకుడు కరెంట్ టవర్ ఎక్కాడు. ప్రియురాలితో పెళ్లి చేయకపోతే ప్రాణాలు తీసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఇలాంటి సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్ తెలివి కారణంగా అతడు దెబ్బకు కిందకు దిగి వచ్చాడు.
అన్ని ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్లాలన్న రూలేమీ లేదు. కొన్ని ప్రేమ కథలు పెద్దల కారణంగా పెళ్లి వరకు వెళ్లకుండానే ముగిసిపోతున్నాయి. మరికొన్ని ప్రేమ కథలు అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ ఇష్టం లేకపోవటం వల్ల పెళ్లి వరకు వెళ్లటం లేదు. తాజాగా, ఓ యువకుడికి లవర్ షాక్ ఇచ్చింది. పెళ్లి చేసుకోవటం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. కరెంట్ టవర్ ఎక్కి ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో బుధవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
షాహ్లాల్ ప్రాంతానికి చెందిన సంతోష్ సాకెత్ అనే 19 ఏళ్ల కుర్రాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. బుధవారం పెళ్లి విషయంలో ప్రేమికుల మధ్య గొడవ జరిగింది. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుందామని సంతోష్ ప్రియురాలిని అడిగాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోవటం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో సంతోష్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఊరి బయట ఉన్న కరెంట్ టవర్ ఎక్కాడు. గట్టిగా అరుస్తూ అటువైపు వెళుతున్న ఊరి జనాన్ని పిలిచాడు. ప్రియురాలు తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు, పోలీసులు టవర్ దగ్గరకు చేరుకున్నారు. అతడిని బతిమాలి కిందకు దించే ప్రయత్నం చేశారు. ఎవరు ఎంత బతిమాలినా అతడు మాత్రం కిందకు దిగలేదు. ఈ నేపథ్యంలోనే ఓ లేడీ కానిస్టేబుల్ సూపర్ ప్లాన్ వేసింది. సంతోష్‌కు ఫోన్ చేసింది. అతడి ప్రియురాలిలా గొంతు మార్చి మాట్లాడింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చింది. తనతో మాట్లాడుతున్నది ప్రియురాలే అనుకున్న సంతోష్ టవర్ పైనుంచి కిందకు దిగి వచ్చాడు. కథ సుఖాంతం అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
