Hyderabad IT Corridor Traffic Chaos
హైదరాబాద్‌లో మూడు రోడ్లు – ముప్పుతిప్పలు.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్.!
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఐటీ కారిడార్‌కు వస్తున్న ఉద్యోగుల సమయమంతా రోడ్ల పాలవుతోంది. కారిడార్‌కు చేరుకునే మూడు రోడ్లలోనూ నిత్యం ఇదే పరిస్థితి నెలకొంటోంది. దీంతో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు.
నగరంలో ఐటీ ఉద్యోగుల విలువైన సమయం రోడ్ల పాలవుతోంది. ఐటీ కారిడార్‌కు వస్తున్న ఉద్యోగులు ట్రాఫిక్ జామ్‌లతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కారిడార్‌కు చేరుకునే మూడు రోడ్లలోనూ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతో ఏ మార్గంలో వెళ్లాలన్నా ట్రాఫిక్ చిక్కులు తప్పట్లేదు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లోనే వాహనాలను నెట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తోంది. రహదారుల విస్తరణ జరగకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలుగా అంతర్గత రహదారులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమవుతోంది. నగరం నలుమూలల నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చే ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంటోంది.కారిడార్ మీదుగా వెళ్లే మూడు ప్రధాన రహదారులే వీరికి ఆధారం. గచ్చిబౌలి ఔటర్‌రింగు రోడ్డు చౌరస్తా నుంచి కొండాపూర్, కొత్తగూడ మీదుగా హఫీజ్‌పేట వరకు ఉన్న పాత ముంబయి హైవే, రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి మైండ్‌స్పేస్ జంక్షన్, సైబర్ టవర్స్, హైటెక్ సిటీ, శిల్పారామం మీదుగా కేపీహెచ్‌బీ-జేఎన్టీయూ వరకు, కొత్తగూడ-కొండాపూర్ చౌరస్తా నుంచి హైటెక్స్ కూడలి, సైబర్ టవర్స్ మీదుగా మాదాపూర్-జూబ్లీహిల్స్ వరకు ఉన్న ఈ రోడ్ల మీదే వీరు ప్రయాణించాల్సి వస్తోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐటీ కారిడార్‌లో రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ నరకం అంటే ఏమిటో కళ్లముందు కనిపిస్తుంది. అడుగులో అడుగు వేసినట్లుగా కదిలే వాహనాలతో గంటల తరబడి రోడ్లమీదే గడపాల్సి వస్తోంది.
