TDP Councillors Hail Madanapalle District Decision
మదనపల్లి జిల్లా ప్రకటనపై టీడీపీ కౌన్సిలర్ల హర్షం
ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పట్టుబట్టి ముందుండి అమలు చేయించిన స్థానిక ఎమ్మెల్యే ఎం. షాజహానా బాషాకు మదనపల్లి కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు.
మదనపల్లె జిల్లా ప్రకటనపై టీడీపీ కౌన్సిలర్ పచ్చిపాల తులసి, మరో ఇద్దరు టీడీపీ మద్దతుదారులైన కౌన్సిలర్లు మార్పూరి నాగార్జునవాబు, ఎస్. కరీముల్లాలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పట్టుబట్టి ముందుండి అమలు చేయించిన స్థానిక ఎమ్మెల్యే ఎం. షాజహానా బాషాకు కృతజ్ఞతలు తెలిపారు.మరోవైపు జిల్లా సాధనకు పోరాటాలు చేసిన ఉద్యమ వీరులకు అభినందనలు తెలిపారు. జిల్లా ప్రకటనతో కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని ఆ ముగ్గురు కౌన్సిలర్లు ప్రకటించారు. అయితే మున్సిపల్ చైర్పర్సన్ వి. మనూజ సహా వైసీపీ కౌన్సిలర్లు ఎవరూ వీరి ప్రకటనకు మద్దతు పలకపోగా, సమావేశం ప్రారంభమై చైర్పర్సన్ ప్రసంగం చేయకనే జిల్లా అంశం ఎందుకని లేవనెత్తారని ప్రశ్నించారు.అంతలో మరో కౌన్సిలర్ బి.ఏ. ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ.. ఇక్కడి కౌన్సిల్లో టీడీపీ కౌన్సిలర్ ఉన్నది ఒకరేనని, మిగిలిన ఇద్దరు వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతుగా నిలవడాన్ని తప్పుపట్టారు. ముగ్గురు చెప్పే అంశాలను తాము ఎలా ఒప్పుకుంటామని మెజారిటీ తామే ఉన్నామనే ధోరణి ప్రదర్శించడంతో కౌన్సిల్లో కొంతసేపు గందర గోళం నెలకొంది. దీంతో ఆ ముగ్గురు కౌన్సిలర్లు సమావేశం నుంచి బయటకు వచ్చేయగా, వైసీపీ కౌన్సిలర్ ప్రసాద్ బాబు అజెండాలోని రెండు అంశాలను వాయిదా వేయాలని కోరారు. అప్పటికే అన్ని అంశాలు ఆమోదించేశామని, సమావేశం ముగిసిందని వైసీపీ కౌన్సిలర్లంతా బయటకు వచ్చేశారు. ఆ అంశాలను అవసరాన్ని బట్టి తానే ర్యాటిఫై చేశారని చైర్ పర్సన్ చెప్పడంతో కౌన్సిలర్ ప్రసాద్ బాబు కూడా అంగీకరించినట్లయింది.రెండు సమావేశాలు చేపట్టి, వాటిపై చర్చ జరగకుండానే కేవలం అయిదు నిమిషాల్లో ఆమోదం, అంతా అయిపోయిందని, ఎలా ప్రకటిస్తారని స్వపక్షంలోనే వివక్ష కౌన్సిలర్ కరీముల్లా వాపోయారు. ఇలా ఇంకా ఎన్నాళ్లు? ఇలా చేస్తారు.? ఇదేనా? ప్రజాస్వామ్యం అంటూ నిలదీశారు. మెజార్టీ మీదే ఉందని, ఇంతకాలం ఇలానే చేశారు? అభివృద్దే లేకుండా చేశారని, ఇక వార్డుల్లోకి పోతే జనాలే చెబుతారంటూ నిట్టూరుస్తూ బయటకు వచ్చేశారు. అనంతరం చర్చ లేకుండా ఆమోదించిన అంశాలను పరిగణలోకి తీసుకోవద్దని, ఆ అంశాలను రీషెడ్యూల్ చేయాలని, లేకుంటే న్యాయపరంగా ముందుకెళ్తానని కరీముల్లా, మున్సిపల్ కమిషనర్ ప్రమీలకు సూచించారు. ఇదిలా ఉండగా, స్వపక్షంలోనే విపక్షంగా ఏడాది కాలంగా అభ్యంతరాలు, ఆటంకాలతో కొన్ని వాయిదా పడుతూ, మరి కొన్ని రద్దయిన వాటితో కలిపి సాధారణ, ఆత్యవసర అజెండాల్లోని 55 అంశాలూ ఆమోదం అనే పదంతో పూర్తయ్యాయి. దీంతో ఆటు మున్సిపల్ అధికారులు, ఆటు కాంట్రాక్టర్లు ఊపీరి పీల్చుకున్నట్లయింది.
