Local Body Reservations Trigger Mixed Reactions
అంచనాలకు అందని విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు
◆:- తాజా రిజర్వేషన్లతో కొందరిలో సంతృప్తి మరికొందరిలో అసంతృప్తి
◆:- 50 శాతం సీలింగ్ రిజర్వేషన్ల ప్రకటనతో నిరాశలో బీసీ సామాజిక వర్గం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల(సర్పంచ్) రిజర్వేషన్లను ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు అంచనాలకు అందని విధంగా ఉన్నాయని రాజకీయ నాయకులు ఆలోచనలో పడ్డారు. గతంలో ప్రకటించిన రిజర్వేషన్లకు భిన్నంగా ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లు ఉండటంతో కొందరు సంతృప్తితో ఉండగా మరికొందరు నాయకులు నిరాశతో ఉన్నారు.

గతంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బేస్ చేసుకొని ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించడంతో 50% కొటాను మించి 66% అవ్వడంతో కొందరు రాష్ట్ర ఉన్నత న్యాయస్థాననికి ఆశ్రయించడంతో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు, ఎన్నికల నియమావళిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు 50% కోటా ప్రకారం ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల అమలు నిలిచిపోవడంతో బీసీ సామాజిక వర్గం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ రిజర్వేషన్లు పూర్తవ్వడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల నియమావళి అమలలో వచ్చే అవకాశం ఉన్నందున పోటీ చేసే ఆశావహులు పోటీ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
