Annadata Sukhibhava Funds Ready for Release
అన్నదాత సుఖీభవ పథకం అమలు సర్కార్ సన్నద్ధం.. మంత్రి కీలక సూచనలు
‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈనెల 19న ఈ పథకం నిధులను సర్కార్ విడుదల చేయనుంది. అదే రోజు పీఎం కిసాన్ పథకం నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది.
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండో విడత అమలుపై వ్యవసాయ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) ఈరోజు (సోవారం) సమీక్ష నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 19న ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద నిధులను కేంద్రం విడుదల చేయనుంది.
ఈ నెల 19న వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే.. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్పీసీఏలో ఇన్ యాక్టివ్గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్నవారు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
