Rising Diabetes Concern in Telangana
మధుమేహంతో జర జాగ్రత్త.. నాలుగో స్థానంలో తెలంగాణ
అన్ని వయస్సుల వారిలోనూ మధుమేహం వ్యాధి సోకుతున్నదని, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించాలని కామినేని ఆస్పత్రి ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ బి.శ్రావ్య, డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని సూచించారు.
అన్ని వయస్సుల వారిలోనూ మధుమేహం(Diabetes) వ్యాధి సోకుతున్నదని, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించాలని కామినేని ఆస్పత్రి ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ బి.శ్రావ్య, డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కొన్ని దశాబ్దాల క్రితం మధుమేహం 40-50 ఏళ్ల పైబడిన వారిలో కనిపించేదని, అయితే ఇప్పుడు 15-20 ఏళ్ల వయస్సు ఉన్న వారిలో కూడా మధుమేహ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతీ రోజు తమ అవుట్‌పేషెంట్ విభాగానికి 20-30 మంది మధుమేహ రోగులు వస్తున్నారని, వారిలో 10-15 ఏళ్ల వాళ్లూ ఉంటున్నారన్నారు. స్థూలకాయంతో బాధపడుతున్నవారూ ఉన్నారని తెలిపారు. గర్బిణులు కూడా జెస్టేషనల్ డయాబెటీస్ కోసం తరచుగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మధుమేహ రోగులు తమ బరువును నియంత్రించుకోవడం చాలా అవసరమన్నారు. ప్రతిరోజూ నడక వంటి వ్యాయామం చేయడం, వైద్యులు సూచించిన మందులను తీసుకోవడం తప్పనిసరి అన్నారు.
