ఉర్సు దర్గా ప్రాంతంలో పూలే విగ్రహ స్థలం కబ్జా ప్రయత్నం?
పూలే విగ్రహ స్థలంలో వెలసిన డబ్బా..! కబ్జాదారుడికి వెనకున్న “హస్తం” ఎవరిది..?
బీసీ వర్గాల నాయకుడి విగ్రహ స్థలాన్ని కబ్జా చేయడం సమంజసమా?
నేటిధాత్రి, వరంగల్.
ఉర్సు దర్గా ప్రాంతంలో జ్యోతిబా పూలే దంపతుల కాంస్య విగ్రహాల నిర్మాణం జరగాల్సిన స్థలం వివాదాస్పదంగా మారింది.
ఈ విగ్రహ నిర్మాణం కోసం సిమెంట్ బ్రిక్స్, అవసరమైన సామాగ్రి ఇప్పటికే సిద్ధంగా ఉండగా, రాత్రికి రాత్రే ఆ స్థలంలో “ఓ వర్గానికి” చెందిన వ్యక్తి డబ్బా కొట్టు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.
గతంలో ఇక్కడ ఉన్న విగ్రహం కూలగొట్టిన దుండగుడు. అదే స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడానికి మాజీ ఎమ్మెల్యే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే విగ్రహ నిర్మాణ ప్రణాళికకు ఈ చర్య పెద్ద ఆటంకం కలిగించే అవకాశముంది.
ఈ ఘటనపై స్థానిక బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “సామాజికవాద పితామహుడు జ్యోతిబా పూలే జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలాన్ని కబ్జా చేయడం సిగ్గుచేటు చర్య”గా పేర్కొన్నాయి.
విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి.
ఇక మున్సిపల్ అధికారులు, స్థానిక మిల్స్ కాలనీ పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
స్థలం కబ్జా ప్రయత్నం మధ్య పూలే విగ్రహ నిర్మాణం కొనసాగుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది
