Farmers Suffer Heavy Losses Due to Rains
వర్షాల కాటుకు రైతులు అల్లాడుతున్నారు
◆:- ప్రభుత్వం రైతుల నాదుకోవాలి
◆:- యాసంగి పెట్టుబడికి రైతు భరోసా త్వరగా ఇవ్వాలి
◆:- మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్,మొగుడంపల్లి, నాల్కల్ మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
సోయాబీన్, పత్తి, మొక్కజొన్న పంటలు
నీటమునిగి పాడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఝరాసంగం మాజీ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ తెలిపారు. వర్షం ఆగకపోవడంతో పంటల తేమ తగ్గక, కోతకు వచ్చిన పంట కూడా చెడిపోతోందని, ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో నిల్వ ఉన్న ధాన్యం కూడా
తడిసి నాణ్యత కోల్పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. వ్యవసాయ అధికారులు పంటల నష్టం వివరాలు సేకరిస్తున్నప్పటికీ, రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని జగదీశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యాసంగి పంటల పెట్టుబడికి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని, పంటల నష్టాన్ని అంచనా వేసి తక్షణమే నష్టపరిహారం అందించాలని, విత్తనాలు
మరియు ఎరువులు సబ్సిడీపై ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
