Blessings for Vemulawada Temple Development
జగద్గురుల ఆశీస్సులతో వేములవాడ ఆలయ అభివృద్ధికి నూతన దశ…!!
– సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి నిదర్శనం – వేములవాడ రాజన్న ఆలయం..!!
సిరిసిల్ల (నేటి ధాత్రి):
హైదరాబాద్ నల్లకుంట శంకరమఠంలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వచనం పొందారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి మరియు ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
“ధర్మ విజయ యాత్ర” లో భాగంగా హైదరాబాద్ కు విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు.
ముఖ్యంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, యాత్రికుల సౌకర్యాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల, దివ్యక్షేత్ర పునరుద్ధరణ ప్రణాళికలను వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని వేములవాడ ఆలయ అభివృద్ధి పట్ల ప్రభుత్వ కట్టుబాటు మరియు జరుగుతున్న పనుల పురోగతిని స్వామివారికి వివరించారు.
జగద్గురుల ఆశీస్సులతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మరింత వైభవంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
