Cine Week 2025 Shines at GITAM University
గీతంలో ఘనంగా సినీ వారం
విద్యార్థులను ఉత్సాహపరచిన దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ కాండ్రేగుల
నేటి ధాత్రి, పఠాన్ చేరు :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ‘సినీ వారం-2025: మీడియా, చలన చిత్రోత్సవాలను’ ఈనెల 23-24 తేదీలలో ఘనంగా నిర్వహించారు. గీతం స్టూడెంట్ లైఫ్, ఎఫ్ఏబీవో సహకారంతో నిర్వహించిన ఈ వేడుకలలో పలుపోటీలు, కార్యశాలలు, ముఖాముఖి కార్యక్రమాలు సృజనాత్మకత, సినిమాటిక్ వ్యక్తీకరణ సమాహారంగా సాగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా, చిన్న నిడివి గల చలన చిత్రాలు (షార్ట్ ఫిల్మ్), ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పోటీలను నిర్వహించగా, దేశవ్యాప్తంగా వర్ధమాన చిత్ర నిర్మాతలు, మీడియా విద్యార్థులతో పాటు అమెరికాలోని డల్లాస్, దుబాయ్ నుంచి కూడా ఎంట్రీలు రావడం విశేషం.
తొలిరోజు ప్రముఖ ఫోటోగ్రాఫర్ మహేష్ పమిడిమర్తి ట్రావెల్ ఫోటోగ్రఫీపై ఉపన్యసించగా, ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సంభాషణలు రాయడంపై (డైలాగ్ రైటింగ్) కార్యశాలను నిర్వహించారు. చివరగా, స్ఫూర్తిదాయకమైన చలన చిత్ర ప్రదర్శనతో ముగిసిన తొలిరోజు కార్యక్రమాలలో పలువురు విద్యార్థులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.చివరి రోజు, దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల నేతృత్వంలో చిత్ర నిర్మాణం (ఫిల్మ్ మేకింగ్), స్ర్కీన్ రైటింగ్ పై వర్క్ షాపులను నిర్వహించారు. ఆ తరువాత ఎంపిక చేసిన షార్ట్ ఫిల్ములను ప్రదర్శించారు. ఇక ఈ వేడుకలకే తలమానికంగా నిలిచిన దర్శకుడు సందీప్ రాజ్, గీతం పూర్వ విద్యార్థి, ప్రముఖ నటుడు హర్ష చెముడుతో ఆకర్షణీయమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమం విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. చిత్ర పరిశ్రమలో తమ ప్రయాణం, విద్యార్థి జీవితంలోని మధుర జ్జాపకాలను వారు విద్యార్థులతో పంచుకున్నారు. ఈ రెండు రోజుల ఉత్సవాలలో పాల్గొన్న ఔత్సాహిక విద్యార్థులు, చిత్ర నిర్మాణం, సంభాషణ రచన, స్ర్కీన్ రైటింగ్ గురించి ప్రాథమిక అవగాహనను పొందారు. సినీ నిపుణులతో సంభాషించేటప్పుడు విద్యార్థులు సినిమా పట్ల తమ అభిరుచిని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఓ సృజనాత్మక వేదికగా తోడ్పడింది. తమకు అభ్యాస అనుభవంతో పాటు సృజనాత్మక దృక్పథాన్ని పెంపొందించేలా అర్థవంతమైన,స్ఫూర్తిదాయకమైన సినీవారం నిర్వహించిన జీ-స్టూడియో బృందానికి విద్యార్థులు కృతజ్జతలు తెలియజేశారు.ఎంపిక చేసిన చిత్రాల ప్రదర్శనకు దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల, గీతంలోని మీడియా స్టడీస్ విభాగాధిపతి సంజీవ్ కుమార్,అధ్యాపకుడు సుబ్బు పేటేటి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మొత్తంగా సినీ వారం విజయవంతం కావడంపై జీ-స్టూడియో బృందం హర్షాతిరేకాలను వ్యక్తపరిచింది.
