Warangal Cotton Farmers Benefiting from Kapas Kisan App
పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్ ఉపయోగకరం
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కపాస్ కిసాన్ యాప్ ను ప్రారంభించిన కలెక్టర్
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:
ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. యాప్ ను పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు సులభంగా,మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమ్ముకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.గురువారం వరంగల్ జిల్లా
దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె, ముద్దునూరు,బంధంపెల్లి,గ్రామాల పత్తి రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవి అధ్యక్షతన కిసాన్ యాప్ పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రైతులకు స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, ఆధార్ , భూమి రికార్డుల ద్వారా సులభంగా నమోదు చేసుకోవడం వంటి సదుపాయాలున్నాయని అన్నారు.

ఆధార్ నంబర్‌తో స్వీయ-నమోదుతో పాటుమార్కెట్లో రద్దీని తగ్గించడానికి క్యూలను నివారించడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్మకాలు జరుపుకోవడంతో పాటు పేమెంట్ ట్రాకింగ్ వంటి సదుపాయాల ద్వారా లావాదేవీలలో పారదర్శకతను అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.ముందుగా ప్లేస్టోర్ నుంచి కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని యాప్‌లో ఆధార్, భూమి రికార్డులు (పట్టాదారు పాస్‌బుక్), పంట రకం, విస్తీర్ణం, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలన్నారు.పత్తి అమ్మాలనుకుంటున్న మార్కెట్‌ను ఎంచుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.నాణ్యమైన పత్తి కి మంచి మద్దతు ధర రూ.8110 వస్తుందని తెలియజేశారు.పత్తి ఏరడానికి కాటన్ బ్యాగ్స్, పాత చీరలు వాడాలని, ప్లాస్టిక్ సంచులు వాడరాదని సూచించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్స్, మరియు ప్రైమరీ స్కూల్ లను కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి, ఏఈఓలు హనుమంతు,విజయ్, రాజేశ్ ఆయా గ్రామాల పత్తి రైతులు పాల్గొన్నారు.
