Land Dispute Intensifies in Enumamula Colony
ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం
నేటిధాత్రి, ఏనుమాముల
ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం తీవ్రరూపం దాల్చింది. తమ స్థలానికి గోడ కట్టగా, దానిని కొంతమంది అన్యాయంగా కూల్చివేశారని భూ యజమాని చంద్రకళ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఏనుమాముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, అధికారులు పట్టించుకోకుండా, దౌర్జన్యం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు. తోట చంద్రకళ తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్ 189/బి మణికంఠ కాలనీ రోడ్డు 4లో తాము 2008 వ సంవత్సరంలో శ్రీనివాస్ వద్ద కొనుగోలు చేశామని, ఇట్టి జాగపై వేరే వ్యక్తులతో తగాదా ఏర్పడటం వలన 2011వ సంవత్సరంలో కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు.. కోర్టు తీర్పు 2018 లో తమకు అనుకూలంగా వచ్చిందని, వెంటనే చుట్టూ ప్రహరీ గోడ కట్టుకున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో వేరే వాళ్ళు జాగా మీధకు రాగా, అప్పుడు ఉన్న సిఐ రాఘవేంద్రరావు ఇరువురి సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఆ భూమి తమదేనని నిర్ధారించినట్లు చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుతం కొందరు భూ ఆక్రమణదారులు, ఓడిపోయిన వారి వద్ద నుండి అగ్రిమెంట్ పెట్టుకొని పది రోజుల క్రితం మా గోడను పాక్షికంగా ధ్వంసం చేశారు అని అన్నారు. ఈ నెల 7వ తేదీన గోడను కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలని ఏనుమాముల పోలీసు స్టేషన్ లో పిటిషన్ ఇచ్చిన కూడా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాదితులు ఈ వివాదంపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
