Collector Urges Quality and Speed in Development Works
నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
విద్య వ్యవస్థ అభివృద్ధి చర్యలలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి పరిశీలించారు.పనుల నిర్వహణలో శ్రేష్టమైన సిమెంట్,ఇసుకను వినియోగించాలని,పనులలో నాణ్యత పాటించాలని తెలిపారు.తెలంగాణ సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల,సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ లతో కలిసి పరిశీలించారు.అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,ఇందులో భాగంగా పాఠశాలలో చేపట్టిన విద్యుత్ వ్యవస్థ,మూత్రశాలలు, భోజనశాల ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా నీటి ట్యాంకులు నిర్మించి త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటుందని,ఈ నేపథ్యంలో పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.చెన్నూరు పట్టణంలోని భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.స్థానిక ప్రజలకు వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని,అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేసే విధంగా గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు
