Debt Dispute
పదివేల అప్పుకు.. ఓ నిండు ప్రాణం బలి..
#మరొకరి పరిస్థితి విషమం.
#సొంత అన్న వదినపై దాడికి పాల్పడిన మరిది.
నల్లబెల్లి, నేటి ధాత్రి:

పదివేల అప్పు కోసం అన్న వదినలపై మరిది దాడికి పాల్పడి వదిన ప్రాణాలు కోల్పోగా అన్న ప్రాణాలతో కొట్టు మి ట్టాడుతున్న సంఘటన గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మేరగుర్తి మల్లయ్య-సమ్మక్క దంపతులకు రమేష్, సురేష్ ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కొడుకు రమేష్ కు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు తర్వాత 8 సంవత్సరాల క్రితం రమేష్ భార్య చనిపోగా. మరల గీసుకొండ మండలం మచ్చ పురం గ్రామానికి చెందిన స్వరూప (35) తో గ్రామంలోనే సహజీవనం చేస్తున్నాడు. స్వరూప భర్త చనిపోయాడని ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి గత పది ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం కొండాపురం గ్రామానికి వలస వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో రమేష్ తల్లిదండ్రులు, తమ్ముడు సురేష్ ఆ గ్రామంలోని ఉంటూ బ్రెడ్డు అమ్ముకుంటూ బతుకుతున్నారు. నాలుగు నెలల కిందట అన్న రమేష్ కు సురేష్ 10 వేలు అప్పుగా ఇచ్చాడు.

అప్పు తీర్చమని అడిగితే ఇవ్వడం లేదంటూ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ సైతం ఇటీవల నిర్వహించినట్లు తెలుస్తుంది. తన బంధువులు చనిపోవడంతో రమేష్ అతని భార్య చావుకు వెళ్లి బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. స్నానం చేసే క్రమంలో వేడి నీళ్లు ఎందుకు పెట్టలేదని తల్లితో రమేష్ గొడవ పెట్టుకోగా ఈ క్రమంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేష్ తన అన్నను తన డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది ఈ నేపథ్యంలో కత్తితో అన్నపై దాడి చేయగా గాయాలు కాగా పక్కనే ఉన్న స్వరూప ఆపడానికి ప్రయత్నించగా సురేష్ ఆమె పైన కూడా దాడి చేసి పొత్తికడుపు చాతి భాగంలో కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. హుటాహుటిన స్థానికుల సహాయంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి గాయాల పాలన ఇద్దరిని తరలించారు. చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన రమేష్ ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రమేష్ పరిస్థితి కూడా విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు స్వరూప కొడుకు శివ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి గోవర్ధన్ తెలిపారు.
