33 Candidates Compete for Congress Post
14వ డివిజన్ ప్రెసిడెంట్ పోటికి 33 అప్లికేషన్లు..
పాత కాంగ్రెస్ కార్యకర్తలకే ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్
అభ్యర్థుల వెల్లువ – ఒక్క అధ్యక్ష పదవికి 33 దరఖాస్తులు?
పాత కార్యకర్తల ఆవేదన – “మా కష్టం విలువ ఎక్కడ?”
ఇతర పార్టీల నుంచి వచ్చినవారిపై వ్యతిరేకత
నాయకత్వానికి పరీక్ష – ఈసారి ఎవరికీ న్యాయం?
ఏనుమాముల, నేటిధాత్రి.
వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఈసారి అనూహ్యంగా భారీ పోటీ నెలకొంది. ఏకంగా 33 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కొద్దిమందికే పరిమితమయ్యే ఈ పదవికి ఇంతమంది పోటీ పడటం వెనుక పార్టీ లోపలి అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.
ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారిని పక్కనపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. “మేము అంతకాలం పార్టీ కోసం పనిచేసింది ఎందుకు?” అన్న ప్రశ్నలు కార్యకర్తల నోళ్లలో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న వారిపై కూడా స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో వ్యతిరేకత ఉందని సమాచారం. టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి పదవి చేపట్టిన ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయని, ఈసారి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది.
పిసిసి స్థాయి నుంచి పాత కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు ఉన్నప్పటికీ, అమలు స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని కార్యకర్తలు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి 14వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈసారి అయినా పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుని నిజమైన కార్యకర్తలకు న్యాయం చేస్తుందా? లేక మళ్లీ కొత్తవారికే అవకాశాలు ఇస్తుందా? అన్నది ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
