ఆరోగ్యం.. ఫిట్నెస్ పై అవగాహన కల్పించేందుకు 2కే రన్
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యువజన క్రీడా వారోత్సవాల కింద రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో 2కే రన్
హాజరైన ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల(నేటి ధాత్రి):
విద్యార్థులు, యువతలో ఆరోగ్యం.. ఫిట్నెస్ పై అవగాహన కల్పించేందుకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా యువజన క్రీడా వారోత్సవాల్లో 2కే రన్ నిర్వహించామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2కే రన్ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు.
జెండా ఊపి 2 కే రన్ ప్రారంభించి.. అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. పోలీస్, రవాణా శాఖ ఆద్వర్యంలో అరైవ్..
అలైవ్ లో భాగంగా ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా చర్యలపై అవగాహన కల్పించామని డ్రైవర్లకు వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేయించామని పేర్కొన్నారు.
చైల్డ్ సేఫ్టీ వీక్ కింద మూడేండ్ల వయసు, అలాగే ఆరేండ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని, పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని, డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించామని గుర్తు చేశారు.
ఈ నెల 19 వ తేదీన జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కెరీర్ & నైపుణ్యాభివృద్ధి నిర్వహించి, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శకత్వంపై యువతకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీన సిరిసిల్లలోని మినీ స్టేడియంలో క్రీడా దినోత్సవంలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, కరాటే, షటిల్ బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 22వ జిల్లా స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
అదే రోజు ఉదయం వేములవాడ పరిధిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, హరిత హోటల్ సమీపంలోని పరిసరాలలో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
అదే రోజు సాయంత్రం సిరిసిల్ల కొత్త చెరువు వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 23వ తేదీన సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని కె కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి ఉద్యోగ సాధన పేరుతో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో యువత, కిశోర బాల బాలికలు అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, డీవైఎస్ఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
