
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 282 జీవోను వెంటనే రద్దు చేయాలి
సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద జీవో కాపీల దగ్ధం
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కార్మికుల పని గంటలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై 5 వ. తేదీన జారీ చేసిన 282 జీవోను వెంటనే రద్దు చేయాలని ఈరోజు సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన చేపట్టడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ పెట్టుబడిదారులు , కార్పొరేట్ల లాభాల కోసం కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీలకి గురి చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని 10 గంటలుగా మార్చి జారీ చేసిన 282 జీవోను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆచరణలో మాత్రం బిజెపి అనుకూల విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుందని కార్మికులకు సంబంధించి షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వంపై నయా పైసా భారం పడనటువంటి కనీస వేతనాల జీవోలను సవరించకుండా పని గంటలు పెంచుతూ జీవో తీసుకురావడం జరిగిందని ఈ జీవో కు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని జూలై 9న కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కోసం జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అత్యధిక సంఖ్యలో హాజరై కార్మిక వర్గ ప్రతిఘటనను ప్రభుత్వాలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య , సిఐటియు నాయకులు జిందం కమలాకర్ , బాలయ్య , రాజయ్య , దేవరాజు , లక్ష్మి , మమత పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.