వీరి బతుకులు సీఎం రేవంత్‌ మీరైనా మార్చండి.

https://epaper.netidhatri.com/view/325/netidhathri-e-paper-20th-july-2024

`250 మంది హోం గార్డుల ధీన గాథ.

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు…సొంత రాష్ట్రంలో నిరుద్యోగులు!

`గతంలో నేటిధాత్రిలో అనేక సార్లు రాయడం జరిగింది.

`రాసిన ప్రతిసారీ గత పాలకులు ఆదుకుంటామన్నారు. మోసం చేశారు.

`అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క్‌ ప్రస్తావించారు.

`మంత్రి సీతక్క గతంలో పాలకుల దృష్టికి తీసుకెళ్లారు.

`పిసిసి. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి స్పందించారు.

`కొలువులిస్తామని చెప్పి కేసిఆర్‌ మోసం చేశారు.

`వారి జీవితాలు నిలబెట్టండి.

`ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీదే ఆశలు పెట్టుకొని బతుకుతున్నారు.

`జై తెలంగాణ అన్నందుకు ఊడిన కొలువులు.

`తెలంగాణ వచ్చినా తరిగి ఫోస్టింగులు రాని నిర్భాగ్యులు.

`ఒకప్పుడు హోం గార్డులు…కొలువులు పోయి వీధిన పడ్డారు.

`ఎన్నో ఏళ్ల ఎదురుచూస్తున్నారు కనికరించండి.

`గత ప్రభుత్వం ఆదుకుంటామని మోసం చేసింది.

`జై తెలంగాణ అన్నందుకు వారి జీవితాలకు చీకటి మిగిలింది.

`కాంగ్రెస్‌ వస్తే మా బతుకులు మారుతాయని ఆశించారు.

`కాంగ్రెస్‌ గెలుపు కోసం కష్టపడ్డారు.

`వాళ్లు అండగా వుంటామని మాటిచ్చారు.

`గత పాలకులు వాళ్లను పదేళ్లు తిప్పుకున్నారు.

`ఇదిగో..అదిగో అని వారి జీవితాలతో ఆడుకున్నారు.

`ఇక మీ మీదే ఆశ…మీరే వాళ్లకు భరోసా!

`ప్రతిపక్షంలో వున్నప్పుడు సహకరించింది మీరు.

`అప్పుడు అసెంబ్లీలో చర్చకు తెచ్చారు.

`కాళ్లరిగేలా తిరిగి అలసిపోయారు. కనికరించండి.

`కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు అప్పటి పాలకులను నిలదీసింది.

`వారి జీవితాలను నిలబెట్టాలని కోరింది.

`వాళ్లకు న్యాయం జరగాలని కోరారు.

`తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇచ్చారు.

`ఇంకా తిరగడానికి వారిలో జీవం లేదు.

`తనువు చాలించాలని కూడా ఓ అభాగ్యుడు ప్రయత్నం చేశాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు…సొంత రాష్ట్రంలో నిరుద్యోగులు! అవును..వినడానికి వింతగా వున్నా..ఇది నూటికి నూరు పాళ్లు నిజం. ఉమ్మడి రాష్ట్రంలో వాళ్లు హోం గార్డు ఉద్యోగాలు చేశారు. తెలంగాణ వస్తే వారికి మంచి రొజులొస్తాయని కలలుగన్నారు. భవిష్యత్తు ఆశాజనకంగా వుంటుందని ఆశపడ్డారు. జీతాలు పెరిగి తమ జీవితాలలో వెలుగులు నిండుతాయని ఆశించారు. కానీ ఆ కలలు కల్లలయ్యాయి. వున్న కొలువులు ఊడిపోయాయి. జీవితాలు వీధిన పడ్డాయి. బతుకులు ఆగమయ్యాయి. జై తెలంగాణ అన్నందుకు జీవితాలు తారుమారయ్యాయి. అయ్యో మా జీవితాలు ఇలా అయ్యాయని రోధిస్తుంటే కేసిఆర్‌ ఆదుకుంటానన్నాడు. కొలువులు ఇస్తామన్నాడు. సానుభూతి మొసలి కన్నీరు కార్చాడు. తమ జీవితాలను కూడా రాజకీయంగా వాడుకున్నాడు. ప్రతిసారీ రేపు, మాపు అనుకుంటూ పదేళ్ల మా జీవితాన్ని ఆవిరి చేశాడు. చివరిదాక ఆశ పెట్టి నిండా ముంచాడు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆదుకుంటామని మభ్యపెట్టిన వాళ్లే…చివరికి ఆగం చేసిన వాళ్లే…

ఇంతకీ ఎం జరిగింది:  

వాళ్లు 250 మంది హో గార్డులు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లకు పైగా కొలువులు చేశారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో సకల జనులతో పాటు వీళ్లు గొంతు కలిపారు. అదే పాపమైంది. జీవితాలకు శాపమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులంతా జై తెలంగాణ అన్నారు. వాళ్లను కూడా రెచ్చ గొట్టారు. తెలంగాణ వస్తే మీ బతుకులు మారుతాయన్నారు. లేకపోతే ఉద్యమ ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. దాంతో విధి నిర్వహణలో లేని సమయంలో జై తెలంగాణ అన్నారు. ఈ విషయం అప్పటి ఉమ్మడి పాలకులకు సమాచారం అందింది. వాళ్ల ఉద్యోగాలకు ఎసరొచ్చింది. కొలువులు పోయి రోడ్డున పడాల్సిన గతి వచ్చింది. అప్పుడు మేమున్నామంటూ మా ప్రయత్నాలు చెసుకోనివ్వకుండా తెలంగాణ రాగానే మీ కొలువులు మీ వస్తాయని నమ్మించారు. తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యేలా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌ నేతలు చేద్దాం… చూద్దామంటూ కొంత కాలం గడిపారు. ఓపిక పట్టమంటూ చెప్పుకుంటూ వచ్చారు. అప్పటి మంత్రులు అయిపోతుంది…అంటూ కాలయాపన చేశారు. రెండోసారి కేసిఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. కొలువులిస్తామని చెప్పి కేసిఆర్‌ మోసం చేశారు: ముమ్మాటికీ ఇది మోసమే! కేసిఆర్‌ ముఖ్యమంత్రి అయిన కొత్తలో తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. అసెంబ్లీలో కూడా గుర్తు చేశారు. నష్టపోయిన వారందరికీ తెలంగాణ పునర్నిర్మాణంలో న్యాయం జరుగుతుందని చెబుతూ వచ్చారు. కొంత కాలానికి హోం గార్డులను మర్చిపోయారు. 

గతంలో నేటిధాత్రిలో పలు కథనాలు: 

  గతంలో నేటిధాత్రిలో అనేక సార్లు రాయడం జరిగింది. ఈ హోం గార్డుల జీవితాలపై నేటిధాత్రి అప్పట్లో వరుస కథనాలు రాసింది. అప్పటి మంత్రుల వివరణలు కూడా తెలుసుకున్నది. వారి దృష్టికి అనేక సార్లు నేటిధాత్రి హోం గార్డులు పడుతున్న బాధలు వివరించే ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యే దృష్టికి కూడా అనేక సార్లు తీసుకెళ్లడం జరిగింది. వాళ్లు చూద్దాం… చేద్దామన్నారు. చేతులెత్తేశారు. గత ప్రభుత్వ హయాంలో ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క అప్పటి పాలకుల దృష్టికి హోం గార్డుల విషయం తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో మీడియా సెంటర్‌ వద్ద హోం గార్డుల పరిస్థితి తెలంగాణ ప్రజలందరికీ తెలిసేలా చేశారు. దాంతో తమ ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరుగుతుందని భయపడిన అప్పటి కొందరు మంత్రులు కేసిఆర్‌ను నచ్చ చెబుతమని మాయ మాటలు చెప్పారు. మీడియాకెక్కొద్దని సూచించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన శ్రీనివాస్‌ గౌడ్‌ హోం గార్డుల యూనియన్‌కు అధ్యక్షుడు. బిఆర్‌ఎస్‌ పదేళ్లు అధికారంలో వున్నప్పుడు సాయపడలేదు. కానీ ఇటీవల హోం గార్డులకు న్యాయం చేయాలంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. చేతిలో అధికారం వున్ననాడు చేయలేదు. ఇప్పుడు మీ గురించి పోరాటం చేస్తానని వారిని మళ్ళీ నమ్మించాలని చూశాడు. తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి హోం గార్డులు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల హోం గార్డులు పిసిసి ఉపాధ్యక్షుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కలిశారు. మళ్ళీ మొరపెట్టుకున్నారు. వెంటనే ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వద్దకు ఈ హోం గార్డులను తీసుకెళ్లారు. గతంలో తమ సమస్యలు అసెంబ్లీ వినిపించిన సంగతి గుర్తు చేశారు. తమకు మీరే సాయం చేయాలని వేడుకున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మాట ఇచ్చారు. ఇంకా తిరగడానికి వారిలో జీవం లేదు. ఇప్పటికే పదేళ్లుగా ఎక్కేగడప, దిగే గడప అన్నట్లు వాళ్లు కలవని నాయకుడు లేదు. కాళ్లు మొక్కని అధికారి లేడు. ఎదురైన దేవుడికల్లా మొక్కారు. గుళ్లూ గోపురాలు తిరిగారు. కొలువులొస్తే మొక్కలు చెల్లించుకుంటామన్నారు. పూజలు చేశారు. తనువు చాలించాలని కూడా ఓ అభాగ్యుడు ప్రయత్నం చేశాడు. హోం గార్డులలో ఓ వ్యక్తి ఉద్యోగం రాదన్న నైరాశ్యంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించడం వల్ల అతని ప్రాణాలు నిలిచాయి. 

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీదే ఆశలు:  

 ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీదే హోం గార్డులు ఆశలు పెట్టుకున్నారు. ప్రజా పాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేస్తే, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రుణ మాఫీ చేసి రైతన్నలకు కానుకనిచ్చింది. వారికి అప్పుల బారం లేకుండా చేసింది. లక్షలాది కుటుంబాలలో పండుగ తెచ్చింది. అలాగే తమ జీవితాలలో కూడా రేవంత్‌ రెడ్డి వెలుగులు నింపుతారని ఆశిస్తున్నారు. మా బతుకులు మీరైనా మార్చండి! అని వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జిల్లాకు చెందిన వాళ్లు కూడా ఈ 250 మందిలో సుమారు 30 మంది వున్నారు. వారి జీవితాలు నిలబెట్టండి. ఎన్నో ఏళ్లుగా వారు కోల్పోయిన కొలువులు ఇగ వస్తాయని, అగ వస్తాయని ఎదురుచూస్తున్నారు. మీరైనా కనికరించండి. వారిని ఆదుకోండి. ఇప్పటికే దశాబ్దానికి పైగా ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయారు. బిఆర్‌ఎస్‌ నాయకులను నమ్ముకొని మోసపోయారు. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒక రోజు కూలీ చేసుకుంటూ, మరో రోజు నాయకులను కలుస్తూ కొలువుల మీద ఆశతో బతుకుతున్నారు. కుటుంబాలు అర్థాకలితో జీవనం సాగిస్తున్నారు. పిల్లలను చదివించుకోలేక, వారికి ఉన్నతమైన భవిష్యత్తును అందించలేక సతమతమౌతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయని ఆశించారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో వున్న ఈ హోం గార్డులు కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీదే ఆశలు పెట్టుకొని బతుకుతున్నారు. ఆశ…మీరిచ్చే భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా వారికి ఓ దారి దొరికితే వందల కుటుంబాలకు అండ దొరుకుతుంది. తమ జీవిత లక్ష్యం ఖాకీ డ్రెస్‌ అని పోలీసు కాలేకపోయినా హోం గార్డు జీవితాలతో యూనిఫాం వేసుకొని మురిసిపోయారు. విధులు నిర్వహిస్తూ గర్వపడ్డారు. సమాజ సేవకు అంకితమైనందుకు ధన్యులమని పొంగిపోయారు. కానీ గత పాలకులు నమ్మించి మోసం చేశారు. తెలంగాణ పేరు చెప్పి గెలిచారు. తెలంగాణ కోసం జీవితాలను, కొలువులను త్యాగం చేసిన హోం గార్డుల జీవితాలలో చీకట్లు నింపారు. కనీసం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. కొలువులొస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!