రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి 20 శాతం నిధులు కేటాయించాలి
ఎన్నికల్లో రైతాంగానికి ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి
రెండు లక్షల రుణమాఫీ,రైతు భరోసా, పంటలకు బోనస్ తక్షణమే అమలు చేయాలి
పంటల మద్దతు ధర, ఉత్పత్తి ఖర్చుల నియంత్రణ చట్టం చేయాలి
ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి:
సమాజ మనుగడలో ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ పాలకులు బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించకుండా కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల సంక్షేమాన్ని విస్మరించడం ఆందోళన కలిగిస్తున్నదని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. రైతుల వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
గురువారం అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేటలోని ఓంకార్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడారు.70 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ప్రజలు జీవిస్తున్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులతో మనిషి బ్రతుకుతున్నప్పటికీ పాలకులకు మాత్రం రైతుల వ్యవసాయంపై పట్టింపు లేదన్నారు. పైగా ఆరుగాలం కష్టించి పండించిన పంటలను మధ్య దళారులు వ్యాపారులు సిండికేట్ అయి దోచుకుంటున్న పండిన పంటలకు సరైన ధరరాక తెచ్చిన అప్పులు తీరక అనేక అవస్థలు పడుతున్న రైతుల గోస ప్రభుత్వాలకు పట్టడం లేదని అవేదన వ్యక్తం చేశారు.
రైతుల భూములను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా చట్టాలను రూపొందించి తమ నైజాన్ని తేట తెల్లం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న సన్నకారు రైతుల వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ప్రకటించకుండా కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా రాయితీలు సబ్సిడీలు మాఫీలు ఇస్తున్నారని ఈ క్రమంలో రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ రైతు కుటుంబాలు దిక్కులేని పరిస్థితిలోకి నెట్టి వేయబడుతున్నాయని పేర్కొన్నారు.52 శాతం మందికి ఉపాధి అవకాశాలు కేవలం వ్యవసాయ రంగంలోనే లభిస్తున్న పాలకులు మాత్రం ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం రైతులకు ఆశాజనకమైన హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా తాత్సారం చేస్తూ మోసం చేస్తున్నారని అందుకు ప్రత్యక్ష నిదర్శనమే రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.ఎన్నికల్లో చెప్పినట్లు రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీ, రైతులందరికీ రైతు భరోసా, పత్తి మిర్చి వరి మొక్కజొన్నలకు క్వింటాకు వెయ్యి రూపాయల తగ్గకుండా బోనస్, 55 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు 5000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబా బాబురావు, జిల్లా నాయకులు నాగెల్లి కొంరయ్య, ఐతం నాగేష్,సింగతి మల్లికార్జున్, కేశెట్టి సదానందం,గోనె రాంచందర్,బుడిమె సురేందర్ తదితరులు పాల్గొన్నారు.