12 ఏళ్ళుగా పస్తులుంటున్న హోంగార్డులు

కుటుంబాలు గడవక కుమిలిపోతున్న హోంగార్డులు
` పోయిన కొలువులు వస్తాయన్న ఆశతో బతుకుతున్నారు
` ఎండనక, వాననక పదేళ్లు విధులు
` చాలీ చాలని జీతాలిచ్చినా భవిష్యత్‌పై ఆశలు పెంచుకున్నారు.
` ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన తప్పుకు బలయ్యారు
` జై తెలంగాణ అన్నందుకు దుర్మార్గంగా వీధిపాలు చేసిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు
` కనికరించి…కాపాడండని వేడుకుంటున్న భాదితులు
` అందరూ బాగున్నారు..వాళ్లేం పాపం చేశారు
` మానవత్వంతో ఆదుకుని భవిష్యత్‌నివ్వండని వేడుకుంటున్న వైనం
` 200 కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఏంకు మొర

జై తెలంగాణ అని గొంతెత్తినందుకు ఆకలి కేకలు. ఆర్థాకలి బతుకులతో తెలంగాణ రాష్ట్రంలో 200 కుటుంబాలు కాలం వెల్లదీస్తున్నాయి. కడుపు నింపని నాలుగు మెతుకులు, చాలీ చాలని జీతాలు..పర్మనెంటు ఆశ లేకపోయినా ఏళ్ళపాటు హోంగార్డులుగా నిత్యం పడిన వెతలు పడిన ఆ అభాగ్యుల ప్రస్తుత పరిస్థితిని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరౌతున్నారు. సొంత రాష్ట్రం ఏర్పడుతుందని మన బతుకులు బాగుపడతాయని ఆశలు పెచుకుంటున్న క్రమంలో విధులు నిర్వహిస్తూనే స్వరాష్ట్ర ఉద్యమంలో జై తెలంగాణ అన్నందుకు అర్ధాంతరంగా కొలువులు కోల్పోయి వారి జీవితాలు వీధిన విసిరేయబడ్డాయి.దాంతో వారి జీవితాలు పనులు లేక ఎంతో ఇష్టంతో చేరిన ఉద్యోగం లేక పస్తులతో చస్తూ విగతజీవులుగా బ్రతుకులీడుస్తున్నారు. గౌరవంగా చేసుకుంటున్న ఉద్యోగం లేకపోవడంతో పిల్లల బతుకులు , కుటుంబాలు పూర్తిగా కాకవికలమయ్యాయి.పదేళ్లు పాటు పని పేరుతో వాడుకుని సరిగ్గా తెలంగాణ వచ్చే సమయానికి ఉద్యోగాల నుంచి పీకేశారు.

జై తెలంగాణ అన్నందుకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు మాకు మెతుకు లేకుండా కొలువులు అర్ధాంతంరంగా తీసేశారని వారికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనౌతున్నారు. అయినా మన తెలంగాణ వస్తే మనకు మన ఉద్యోగాలొస్తాయనుకున్నారు. తెలంగాణ కోసం తనువులనే త్యాగం చేసిన వారి ముందు మనదెంత అనుకున్నారు. తెలంగాణ వచ్చాక మళ్లీ మన ఆత్మగౌరవంతో మన కొలువులు మనకొస్తాయని ఎదరుచూశారు…తెలంగాణ వచ్చింది. సంబరాలు తెచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపింది. కాని చీకటిలోకి నెట్టేయబడిన హోంగార్డుల జీవితాలకు వెలుగు రాలేదు. ఇంకా వారి జీవితాల్లో వెలుగులు ప్రసరించలేదు. పోయిన కొలువులు రాలేదు. వారి గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. జై తెలంగాణ అన్న నాటి నుంచి నేటి దాకా తెలంగాణ ఆత్మగౌరవమైన టిఆర్‌ఎస్‌కు కూడా జైకొట్టినావాళ్లే…ఎంతో మంది జీవితాలు గాడిన పడ్డట్టే తనకూ దారి దొరుకుతుందని ఎదురు చూస్తున్నారు. పోయిన కొలువులు మళ్లీ వస్తాయన్న ఆశతో బతుకుతున్నారు. కాని కాలం వారిలో నిర్వేదం నింపుతోంది. ఆశలు అడుగంటుతున్నాయి. కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. మాటలు మూగ బోతున్నాయి. ఏడ్చీ ఏడ్చీ కనుపాపలు కుమిలిపోతున్నాయి. ఇతరులతో కలవలేకపోతున్నారు. బంధువుల వద్దకు వెళ్లలేకపోతున్నారు. పూట గడవని బతుకులొస్తాయని కలలో కూడా ఊహించలేదు. ఏం పాపం చేశారని ఈ కుటుంబాటు వీధిన పడ్డాయని వీరి పరిస్థితి తెలిసినవారందరు ఆవేదన చెందుతున్నారు.


` అందరూ బాగానే ఉన్నారు
తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు కొత్త జీతాలు అందాయి. కొత్త జీవితాలు మొదలయ్యాయి. ఆత్మగౌరవం వెల్లిరిసింది. కింది స్ధాయి నుంచి పై స్ధాయిదాకా మార్పులొచ్చాయి. ఓ రెండొందల మంది హోం గార్డులకు ఉద్యోగాలు పోయాయి. తెలంగాణ వచ్చాక కొన్ని వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణలో ఇప్పుడు పనిచేస్తున్న వేలాది మంది హోం గార్డులకు జీతాలు కూడా పెరిగాయి. కాని ఈ రెండొందల మంది మాత్రం బతుకు సమరం సాగిస్తున్నారు. వాళ్లు కొలువులు చేసిన నాడు విధులకు సమయం సందర్భం లేని వేళలు. ఇక తెలంగాణ ఉద్యమ కాలమంతా ఎప్పుడు తిన్నారో, ఎప్పుడు పడుకున్నారో తెలియని అయోమయం. రోడ్లమీదే తిండితిప్పలు. ఎక్కడినుంచి ఎక్కడకు పంపిస్తారో తెలియదు. ఎన్ని గంటలు పనిచేయాలో తెలియదు. అయినా ఎనాడైనా జీవితాల్లో వెలుగులు రాకపోకపోతాయన్న ఆశ. ప్రతి ఉద్యోగి కనే కలే. కాకపోతే హోంగార్డుల జీవితాలే ఎందుకు ఇలా తలకిందులయ్యాయి. వారి జీవితాలు ఎందుకు బజారున పడ్డాయనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమౌతున్నాయి.
` ఖాకీ దుస్తులంటే ప్రాణం
ఖాకీ దుస్తులు వేసుకొని మురిసిపోయారు. ఆ దుస్తుల్లో వున్న ధైర్యంతో ముందుకు సాగారు. సమాజ రక్షణలో పాలు పంచుకున్నారు. చాలీ చాలని జీతమైనా, ఓర్చుకున్నారు. ఎండనక, వాననక పదేళ్లు పనిచేశారు. ఆకలి కూడా మర్చిపోయిన పనుల్లో నిమగ్నమయ్యారు. భవిష్యత్తులో కానిస్టేబుల్‌ ఉద్యోగాల రిక్రూట్‌ మెంటు పడితే వెయిటేజీ వస్తుందన్న ఆశతో కూడా పనిచేశారు. పోలీసు ఉద్యోగం చేయాలన్న అంకితభావంతో వారంతా విధులు నిర్వర్తించారు. అదేంటో వారి ఆశలు మొగ్గలోనే తుంచివేయబడ్డాయి. వారి ఆశలు అడియాసలయ్యాయి. ఉద్యోగాలు పోయాయి.
` నాటి పాలకుల తప్పుకు బలైన హోంగార్డుల జీవితాలు
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఐడి కార్డులున్నాయి. డిపార్టుమెంటులో జాయిన్‌ అయ్యాక తీసుకున్న బ్యాంకు ఖాతాలున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫారమ్స్‌ వున్నాయి. పదేళ్ల సర్వీసు వుంది. అప్పాయింటు మెంటు లెటర్‌ లేదంటూ ఉద్యోగాలనుంచి తొలిగించారు. అది ఆనాటి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. దానికి హోంగార్డులెలా బాధ్యలౌతారు , బలౌతారు? ఎలాగూ ప్రశ్నించలేని చిన్న ఉద్యోగులన్న చిన్న చూపా? వారిని విధుల్లోనుంచి తీసేసిన తర్వాత కూడా డిపార్టుమెంటు వారిచేత నగరంలో బోనాల పండుగలకు బంధోబస్తులకు కూడా వినియోగించుకున్నారు. అయినా ఉద్యోగులుగా గుర్తించలేమని వదిలేశారు. వారి జీవితాలను తుంచేశారు. పదేళ్ల సర్వీసు పోయింది. పదేళ్లు చేసిన పని పోయింది. నడీడు వచ్చి చేరింది. ఇప్పుడు ఏం చేయమంటారని వారు పాలకులను అభ్యర్ధించుకుంటున్నారు? ఆత్మగౌరవం కోసం పనిచేసి ఉద్యోగం పోగొట్టుకొని కూలీలుగా , ఆటోలు డ్రైవర్లుగా జీవితాలను వెల్లదీస్తున్నారు.
` సీఎంగారు దయచేసి కనికరించండి
ఈ విషయం గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి వెళ్లింది. అసెంబ్లీలో కూడా 2018కి ముందు నాటి బిజేపి ఎమ్మెల్యే లక్ష్మణ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా సానుకూలంగా స్పందించారు. వారికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని హోంగార్డుల రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు అప్పగించారు. ఇక తమ జీవితాలు మళ్లీ చిగురిస్తున్నాయని ఆశపడ్డారు. హామీ ఇచ్చి నాలుగేళ్లయినా వారి జీవితాలను ఎవరూ పట్టించుకోలేదు. గతంలో పలు మార్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను కలిసి విన్నపాలు చేసుకున్నారు. పని అవుతుందిలే అనే సమాధానాలతో పదేపదే సంతృప్తిపొందుతూ వచ్చారు. అయినా వారి ఉద్యోగాలు వారికి ఇంకా అందలేదు. వారి జీవితాలకు ఉద్యోగాలు అందలేదన్న సంగతి ముఖ్యమంత్రికి తెలియాల్సిన అసవరం ఉందన్న ఆవేదన వారిలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే తమకు ఉద్యోగ కల్పన జరిగిందని అనుకునే అవకాశం ఉందని నుమానం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎలాగైనా తమ గోడు మరోసారి ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి వెళ్లాలి. ఎలాగైనా మళ్లీ తమ కొలువులు వస్తాయన్న కోటి ఆశలతో రెండు వందల మంది హోంగార్డులు ఎదురుచూస్తున్నారు. జై తెలంగాణ అన్న పాపానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు కోల్పోయిన తెలంగాణ బిడ్డలను గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం వుంది. వారి ఉద్యోగాలు మళ్లీ వారికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!