నర్సంపేట,నేటిధాత్రి :
చైల్డ్ హెల్ప్ లైన్ -1098 బాలల సంరక్షణ కొరకే ప్రత్యేకంగా పని చేస్తుందని చైల్డ్ లైన్ సూపర్ వైజర్ జక్కోజు కృష్ణ తెలిపారు.నర్సంపేట పట్టణంలోని తెలంగాణా మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో వరంగల్ జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్-1098 ఆధ్వర్యంలో బాలికలకు అందించే సేవలు, బాలల సమస్యల గురించి అవగాహన కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీపాల అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా చైల్డ్ లైన్ సూపర్ వైజర్ జక్కోజు కృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహ నిర్ములన చట్టం, బాల కార్మికుల నిషేధ చట్టం, లైంగిక వేధింపుల నిషేధ చట్టం (ఫోక్సో) తదితర బాలల రక్షణ చట్టాల పట్ల తెలిపామన్నారు.బాలికలు ధైర్యంగా సమస్యలను ఎదిరించే స్థాయికి ఎదగాలని కోరారు. ఆడపిల్లలే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అపరిచిత వ్యక్తుల ప్రవర్తన పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వారి ప్రవర్తన పట్ల ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ -1098 మరియు పోలీస్ -100 టోల్ ఫ్రీ నంబర్స్ కు సమాచారం అందించి రక్షణ పొందాలని తెలియజేశారు.
బాలల హక్కులు ప్రధానంగా నాలుగు కలిగి ఉన్నారని వాటిలో జీవించే హక్కు,రక్షణ పొందే హక్కు,భాగస్వామ్యం (పాల్గొనే)హక్కు,అభివృద్ధి చెందే హక్కు అని బాలల హక్కుల గురించి అవగాహన కల్పించారు. చైల్డ్ లైన్ కేస్ వర్కర్ దారవత్ మౌనిక మాట్లాడుతూ బాలల సమస్యల పరిష్కారానికి, బాలల రక్షణ,సంరక్షణ ల కొరకు జిల్లా కేంద్రంలో చైల్డ్ హెల్ప్ లైన్ -1098 సేవలను అందిస్తున్నదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, స్కూల్ కోఆర్డినేటర్ శైలజ, కాలేజీ కోఆర్డినేటర్ కల్పన బాలికలు పాల్గొన్నారు.