గజ్వేల్ నుంచి ఈటెల పోటీ ఉత్త ప్రచారం?
హుజూరాబాద్ ప్రజలను మరో సారి మభ్యపెట్టేందుకే?
మేడ్చల్ నుంచి ఈటెల పోటీ ఖాయం?
నేటిధాత్రి చెప్పిందే నిజమైంది..
ఈటెల అంతరంగం నేటిధాత్రి ఏనాడో బైటపెట్టింది…
హుజూరాబాద్ లో ఈటెల పోటీ చేయడం అదే ఆఖరని ఆనాడే చెప్పింది.
ఇప్పుడు అదే మాట ఈటెల నోటి నుంచి వస్తోంది…
ఉప ఎన్నికల సమయంలోనే హెచ్చరించిన నేటిధాత్రి…
తియ్యటి మాటలు, ఆ వెనుకే గొయ్యి తీసే చేతలు ఎలా వుంటాయో ఒక్క సారి ఈటెల ముచ్చట వినండి. ఈసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా! ఈటెల తాజా ప్రకటన…నమ్ముదామా? నమ్మదగిన మాటేనా? కాదు అదంతా తనకు తాను సాగిస్తున్న ఒట్టి ప్రచారం… అబద్ధపు ప్రచారం.. ప్రజలను మభ్యపెట్టే ప్రచారం…! హుజూరాబాద్ రాలేను…మీకు సేవ చేయలేను అని చెప్పలేక, వచ్చే ఎన్నికల రాగం అందుకొని మరో సారి మోసం చేయడానికి రక్తి కట్టించే నాటకం మొదలు పెట్టారు. ఈసారి ఈటెల పోటీ చేసేది మేడ్చల్ నుంచే…అది ఎప్పుడో ఖాయం చేసుకున్నాడు…కాకపోతే ఉప ఎన్నికలో ఎన్ని జన్మలెత్తినా హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు… జీవితాంతం హుజూరాబాద్ ప్రజల కోసం పని చేస్తానన్నాడు. ఈ మాటలు చెప్పి సరిగ్గా ఏడాది కూడా కాలేదు. ఏరు దాటేదాక ఓడ మల్లన్న…ఏరు దాటాక బోడి మల్లన్న… అన్నట్లే హుజూరాబాద్ కు ఈటెల జెల్లకొడుతున్నాడు. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో పోటీ చేయడం ఇదే ఆఖరుసారి అని నేటిధాత్రి ఏనాడో చెప్పింది. చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు మరో సారి నమ్మించి ఈటెల మోసం చేయనున్నాడని నేటిధాత్రి చెప్పినట్లే జరిగింది.
తాజాగా ఈటెల రాజేందర్ తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గం వెళ్లడం మర్చిపోయాడు. ఉప ఎన్నికల సమయంలో నేటిధాత్రి ఇదే విషయాన్ని చెబుతూ, ప్రభుత్వం తనకు నిధులు ఇవ్వడం లేదంటూ మెల్లిగా జారుకునే ప్రయత్నం చేస్తాడని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే చేస్తున్నాడు..అదే చెప్పుకుంటున్నాడు. ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేదు. నాడు సానుభూతి కోసం పాకులాడి, అమాయకులైన ప్రజలకు మాయ మాటలు చెప్పాడు. మీ రుణం తీర్చుకోలేన్నాడు…అన్నట్లే ఆ మాట నిజం చేస్తున్నాడు….మీ రుణం తీర్చుకోలేనని మరో నియోజకవర్గం చూసుకోవడానికి సిద్ధ మయ్యాడు…పైకి చెప్పే కారణాలు ఎన్నైనా, అవన్నీ గెలిపించిన ప్రజలకు అవసరం లేదు. ప్రతి ఎన్నికలలో నమ్మి ఓట్లేసి గెలిపించి, అంత పెద్ద లీడర్ ను చేస్తే, రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోయినట్లు ఈటెల కొత్త నియోజకవర్గం వెతుక్కుంటున్నాడు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఆయనే స్వయంగా చెప్పుకుంటున్నాడు. తన రాజకీయాన్ని, మొత్తం వ్యాపారాలకు అనువుగా మార్చుకుంటున్నాడని కూడా నేటిధాత్రి ముందే చెప్పింది. ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించుకున్న తర్వాత ఎంత దూరమైనా సరే వెళ్లాలి. వాళ్ల మధ్యనే వుండాలి. కానీ అది ఈటెలకు కుదిరేలా లేదు. అందుకే తన ఆవాసానికి, వ్యాపారానికి అనువైన నియోజకవర్గం కావాలి. ముఖ్యంగా హైదరాబాద్ కు ఎప్పుడూ అందుబాటులో వుండే నియోజకవర్గం ఎంచుకోవాలనుకుంటున్నాడు. అయితే ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేస్తానంటూ ఈటెల ప్రచారం చేసుకోవడం మేకపోతు గాంభీర్యం…! కాకపోతే మేడ్చల్ నుంచి పోటీ చేయాలనే గతం నుంచి చూస్తున్నాడు. ఒకవేళ టిఆర్ఎస్ లో వున్నా ఈటెల ఈసారి మేడ్చల్ నుంచో, మరో చోట నుంచో పోటీ చేసే వారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూరాబాద్ నుంచి పోటీ చేసే వారు కాదు. ఈ విషయం ఎన్నికల సమయంలో అనేక సార్లు నేటిధాత్రి చెప్పింది. దాన్ని టిఆర్ఎస్ కూడా సరిగ్గా ప్రచారం చేయలేకపోయింది. దానిని ఒక అస్త్రంగా మార్చుకోలేకపోయింది. ఈటెల రాజేందర్ అసలు స్వరూపం ప్రజల ముందు ఆవిష్కరించలేకపోయింది. మీడియా ఎంత చెప్పినా నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తేనే మార్పుకు సంకేతం… ఏది ఏమైనా ఈటెల రాజేందర్ ఈ పని చేస్తాడని మాత్రం నేటిధాత్రి ముందే చెప్పి, ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేసింది. సక్సెస్ పుల్ గా భవిష్యత్తులో ఈటెల అడుగులపై ముందే హెచ్చరించింది.