కార్యకర్తలు కరెక్టుగానే వున్నారు.
శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు.
అనేక త్యాగాలు చేస్తున్నారు.
నాయకులే గందరగోళంలో వున్నారు.
జనం నమ్మకుండా చేసుకుంటున్నారు
కుర్చీలాటలో కుమ్ములాటలో మునిగి తేలుతున్నారు
పదవుల పందేరమే చూసుకుంటున్నారు
ఆధిపత్యాలే ముఖ్యమనుకుంటున్నారు
రాహుల్ పర్యటన జోష్ నింపేనా?
నేతల మధ్య సఖ్యత కుదిరేనా?
లుకలుకలు తొలిగేనా?
తాజాగా రేవంత్, కోమటి రెడ్డి వివాద టీ కప్పులో తుఫానేనా?
అందరి చూపు రాహుల్ సభ మీదే!
రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక్కసారిగా వేడివేడిగా సాగుతున్నాయి. అసలే ఎండా కాలం. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర కాలముంది. కాని ఇప్పుడే తట్టుకోలేనంత రాజకీయ వేడి మొదలైంది. రాజకీయమంతా హాట్ హాట్‌గా సాగుతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దేశ రాజకీయాలపై దృష్టిపెడుతోంది. దేశ రాజకీయాలను సమూలంగా మార్చే స్కెచ్ వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి తిరిగి మేమే వస్తామన్న ధీమా కనిపిస్తోంది. ఆ వాదన బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో కనిపిస్తున్న అభివృద్ధి దేశానికంతటికీ అందిస్తామని టిఆర్ఎస్ అంటోంది. కాని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, బిజేపి పార్టీలు లుకలుకలు చవి చూస్తున్నాయి. ఎవరు ఏ రోజు ముందుకొస్తారో? ఎవరు ఏ రోజు వెనకబడి పోతారో? ఎప్పుడు ఎవరు అసంతృప్తి వ్యక్తం చేస్తారో తెలియకుండా బిజేపి, కాంగ్రెస్‌లున్నాయి. అయితే ఓ వైపు బిజేపి రాష్ట్రంలో తామే ప్రత్నామ్నాయం అనుకుంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టిండు. ఎర్రటిఎండల్లో పాదయాత్ర సాగిస్తున్నాడు. కాకపోతే ప్రజా సంగ్రామయాత్ర అంటున్నాడు. అది బిజేపి సంగ్రామ యాత్రలాగే వుంది తప్ప, ప్రజలతో సాగుతున్నట్లు లేదన్న విమర్శలున్నాయి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కూడా జోష్ పెంచే దిశగానే అడుగులేస్తోంది. వచ్చే నెలలో వరంగల్‌లో రాహుల్ గాంధీ భహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. పెద్దఎత్తున జన సమీకరణ కోసం ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. పిసిసి అధ్యక్షుడు రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. కాకపోతే దేశంలో , రాష్ట్రంలో ధరల పెరుగుదల ఆగడం లేదు. రైతుల గందరగోళ పరిస్ధితుకు కారణం బిజేపి. పెట్రోల్ చార్జీల పెంపును కూడా సమర్ధించుకుంటూ, రాష్ట్రాల మీద నెపం నెట్టేస్తూ బైట పడాలని బిజేపి చూస్తోంది. వరి వేయండి. కేంద్రంతో కొనిపిచ్చే బాధ్యత నాది అని బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అప్పుడు చెప్పి,ఇప్పుడు మర్చిపోయాడు. పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆఖరుకు వరి రాష్ట్రమే కొంటోంది. అటు కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి, ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్న టిఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ చాణక్యంలో ఎటు వైపు మొగ్గాలో తెలియక కాంగ్రెస్ సతమతమౌతోంది. ఏ వైపు దారి ఎంచుకున్నా ఇబ్బందికరమైన పరిస్ధితేవుంది. ధరలకు కారణం బిజేపి అంటే, టిఆర్ఎస్ లాభం. వరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది బిజేపికి లాభం? మరి కాంగ్రెస్‌కు ఏం లాభం? ఎలా లాభం? ఆలోచించుకోవడానికి కూడా కాంగ్రెస్‌కు ఉపిరి సలపకుండా బిజేపి, టిఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నాయి. రెండుపార్టీలను తిట్టాల్సిన సమయంలో ఎవరిని ఎక్కువ తిట్టినా, ఎవరిని తక్కువ తిట్టినా తూకం వేసి మరీ కాంగ్రెస్‌ను కంగారు పెట్టేందుకు రెండు పార్టీలు కాపు కాచుకొని కూర్చొని వున్నాయి.
మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నాయకులు ఏం చేయాలి? ఎలా స్పందించాలి. ఎలా ముందుకెళ్లాలి? ఎలా టిఆర్ఎస్ను ఎదుర్కొనాలి? ఎలా బిజేపిని ఎండగట్టాలి? ఇది కాదా? రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆలోచించాల్సింది. కాని ఏం చేస్తున్నారు? ఒకరినొకరు నిచ్చెన మీదనుంచి ఎలా లాగేసుకుందామని ఎదరుచూస్తున్నారు? క్షణం పడక ఎడమొహం, పెడమొహం పెట్టుకుంటున్నారు. నిన్నటిదాకా నీ లెక్కెంత? అంటే నీ లెక్కంత అనుకున్నారు? పార్టీ కేంద్ర పెద్దలు తలంటడంతో సర్ధుకున్నట్లే కనిపించింది. మళ్లీ నల్లగొండ ఎపిసోడ్‌తో వేడి రాజుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులు ఎప్పుడు కలిసుంటారో తెలియదు? ఎంత సేపు కలిసుంటారో తెలియదు? కలిసున్నంత సేపు ఎలా వుంటారో కూడా తెలియదు? ఎంత సేపట్లో కయ్,కయ్ అనుకుంటారో అసలే తెలయదు. ఎంత చెప్పినా ఎందుకు కలిసుండరో వాళ్లకే తెలియదు. ఎంత మంది నచ్చజెప్పినా అప్పుడే ఎలా దులిపేసుకుంటారో తెలియదు? ఇంత గందరగోళం ఏ పార్టీలోనూ వుండదు. అసలు పార్టీ అధికారంలోకి రావాలని వాళ్లలో వుందో లేదో కూడా తెలియదు? వాళ్లకు ఏదీ తెలియదు? కాని పిసిపి మాత్రం అందరికీ కావాలి. వాళ్ల ప్రమేయం లేకుండానే పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కావాలి. అందుకు ఎప్పుడు ఎన్నికల ముచ్చట వచ్చినా నేనే సిఎం అనుకోవాలి. ఓ కర్చీప్ వేసుకొని చూడాలి. ఇలాగే ఎదురుచూస్తుండండి అని జనం తిట్టుకున్నా సరే…మేం మారం…మీరు మారకండి అని ప్రజలకు చెప్పినట్లే వుంది కాంగ్రెస్ నేతల పరిస్ధితి. తాజాగా నల్లగొండ జిల్లా వివాదం అవసరమా? పిసిసి స్టార్ క్యాంపైనర్ నల్ల గొండ జిల్లా నుంచి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వుంటే మాత్రం పిపిసి అధ్యక్షుడు రేవంత్ వెళ్లొద్దా? రావొద్దా? ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయాలో అర్ధం కాదు. మీరంతా ఒక్కటే. మీ పార్టీ ఒక్కటే. అయితే సీనియర్లుగా పేరున్న వారి జిల్లాలకు పిసిసి. రావాల్సిన అవరసం లేదు. వస్తే మేం హజరుకాలేము అని చెప్పడమేమిటో? ఎవరికీ అర్ధం కాదు. మొన్నటిదాకా జగ్గారెడ్డిది ఇదే తీరు…ఆయన కొంచెం మారిండేమో అనుకునే సరికి మళ్లీ కోమటి రెడ్డి మొదలైండు. ఎంత సేపు నేను సీనియర్ని అనుకుంటూ పోతే సరిపోతుందా? పార్టీ నేతలందరికీ ఒక్క గొడుకు కిందకు తెచ్చే యోచన లేదా? ఆ అవసరంలేదా?
నాయకులు తిట్టుకున్నా, నాయకులు చాల మంది పార్టీలు మారినా, పార్టీ కోసం నిలబడ్డ వారిలో కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరైనా అభినందించాల్సిందే. వారికి పార్టీ మీద వున్న కమిట్ మెంటు సామాన్యమైంది కాదు. నిత్యం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ సాగుతున్న సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలకు నిత్యం క్షీరాభిషేకాలు చేసినా తప్పులేదు. పాద పూజలు చేసినా నష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పాపం కార్యకర్తలు ఏనాడు సుఖపడిరది లేదు. సంతోషంగా వున్నది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కాలంలో అధికారంలో వుండి కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నది ద్వితీయ శ్రేణి నాయుకులు, కార్యకర్తలే. నాడు అడుగడుగునా ఉద్యమ కారులు కాంగ్రెస్నాయకులను తిట్టినా, దుమ్మెత్తి పోసినా ఓపికతో వున్నారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని నమ్మకంతో పార్టీలో కొనసాగారు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా ఆ పార్టీనే పట్టుకొని వేళాడుతున్నారు. కాని ఎంతో మంది ఎన్నెన్నో పదవులు అనుభవించిన సీనియర్లు పార్టీని వీడిపోయారు. పదవుల కోసం పార్టీని ముంచి పారిపోయారు. కాని కార్యకర్తలు ఎక్కడా చెక్కు చెదరలేదు. ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి ఇబ్బందులు ఎదురౌతున్నా ఎనమిదేళ్లుగా భరిస్తూనే వున్నారు. కాని నాయకుల్లో ఈ కృతజ్ఞత లేదు. ఆ విశ్వాసం లేదు. కార్యకర్తలే ఇన్ని త్యాగాలు చేస్తుంటే కనీసం మనం కాస్త తగ్గి వుంటే సరిపోతుందన్న ఆలోచన కూడా లేదు. సహజంగా రాజకీయ నాయకులు పదేళ్లపాటు క్రియాశీల రాజకీయల్లో లేకుంటే కనుమరుగౌతారు. అలాంటిది ఉద్యమ కాలంలోనూ ఇబ్బందులు ఎదుర్కొని, ఎనమిదేళ్లుగా అంతకన్నా ఇబ్బందులు ఎదుర్కొంటూ కాంగ్రెస్ జెండా పట్టుకొని నడుస్తున్న వారి కోసమైనా సీనియర్లు కలిసుండాలి. అధికారం ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వస్తుంది . కార్యకర్తలకున్నంత నమ్మకం పార్టీ నాయకులకు లేదు. కార్యకర్తలకున్నంత ధైర్యం నాయకులకు లేదు. కార్యకర్తలు చేస్తున్నంత త్యాగం నాయకులు చేయలేకపోతున్నారు. రాహుల్ గాంధీ సభతోనైనా సీనియర్లు మారుతారా? లేక మేమింతే అని నిరూపిస్తారో చూద్దాం???