సారయ్య శల్య సారధ్యం!?

`పదవి ఇచ్చి గుర్తించినా పార్టీకి పని చేయని వైనం?

`పరోక్షంగా పదే పదే నన్నపనేనిపై అసత్య ప్రచారం?

`హుజూరాబాద్‌ ఎన్నికలలో చేసిందేమీ లేదు?

`వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలలో కిరికిరి రాజకీయం?

`టిఆర్‌ఎస్‌ కు లోలోన వ్యతిరేక ప్రచారం?

`మున్సిపల్‌ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సారయ్య ఇద్దరు తమ్ముళ్లని,అనుచరుడుని పోటికి దించిన వైనం?

`పార్టీలో ఎగదోసే ఎత్తుగడలు?

`ఆయన వల్ల ఎవరూ టిఆర్‌ఎస్‌ లో చేరింది లేదు?

`ఉన్న వాళ్లనే సాగనంపే వ్యవహారం మామూలుగా లేదు?

`పార్టీలో అలకలు, లుకలుకలకు ఆజ్యం?

`తూర్పును అస్థిర పర్చడమే అసలు లక్ష్యం?

 

కాలమెప్పుడూ మనదే కాదు…ఎప్పుడూ మనకే అనుకూలం అసలే కాదు…కాలం అనుకూలించినంత కాలమే మనది…మనది కాని కాలం కోసం పరుగులు పెట్టినా లాభముండదు. ఇది తెలియక కొందరు, తెలిసినా కొందరు భ్రమల్లో వుంటూ కాలం అనుకూలత కోసం ఆరాపడుతుంటారు…ఇతరులను ఆగం చేసే ప్రయత్నం చేస్తూ వుంటారు…అలాంటి వారి వరసలో బస్వరాజు సారయ్య చేరిపోయినట్లున్నాడన్నది తూర్పులో జరుగుతున్న ప్రచారం. సారయ్య బలహీన వర్గాల నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చిన అదృష్టవంతుడు. ఇంత వరకు బాగనే వుంది. కాని సొంత పార్టీలో కుంపటిరేపే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టిడంతో ఆయన అసలు నిజస్వరూపం బైట పడుతోంది? తెలంగాణ ఉవ్వెత్తున సాగుతున్నంత కాలం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో వున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు…ఇక్కడే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి. 

 

అది ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయం. తెలంగాణ ఉద్యమమే లేకుంటే బస్వరాజు సారయ్యకు మంత్రి పదవే దక్కేది కాదు…ఈ మాట ఎవరో అన్నది కాదు…స్వయంగా జయశంకర్‌ సార్‌ ఆయనతో అన్న మాట. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటాన్ని నీరుగార్చే క్రమంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేకు కాస్త ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మంత్రులను చేశారు. అయితే అప్పటికే ఉమ్మడి వరంగల్‌ నుంచి తిరుగులేని నేతగా, మరొకరికి అవకాశం ఇవ్వొద్దన్నంతగా పొన్నాల లక్ష్యయ్య మంత్రాంగం నడిపినా ఉద్యమం పుణ్యమా అని బస్వరాజు సారయ్య మంత్రి అయ్యారు. అయితే అదే సమయంలో తెలంగాణ ఉద్యమకారులు బస్వరాజు సారయ్యను మంత్రి పదవి తీసుకోవద్దని పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో తెలంగాణ వాదులనుంచి వస్తున్న సూచనలను కాదనలేక, మంత్రి పదవి వదులుకోలేక జయశంకర్‌ సార్‌ వద్దకు వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. పనిలో పనిగా ఒక బిసి నాయకుడినైన తనను ఇలా ఉద్యమ కారులు అడ్డుకోవడం బావ్యం కాదని జయంశంకర్‌ సార్‌ ముందు సారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఒక్క మాట చెబితే తెలంగాణ వాదులు, ఉద్యమ కారులు తాను మంత్రి పదవిని స్వీకరించడంపై అభ్యంతరాలు తగ్గుతాయని వేడుకున్నాడు. దాంతో జయశంకర్‌ సార్‌ ఓపెన్‌ స్టేట్‌ మెంట్‌ ఇవ్వడం జరిగింది. సారయ్య కాకపోతే మరో ఎమ్మెల్యే మంత్రి అవుతాడు…మనది వ్యవస్ధ మీద పోరాటమే తప్ప వ్యక్తుల మీద కాదని జయశంకర్‌ సార్‌ ఉద్యమ కారులను నచ్చజెప్పడంజరిగింది. అయినా ఆయన ఏనాడు జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలకలేదు. ఇక సకల జనుల సమ్మె కాలంలో మంత్రికి తమ సేవలను ఆపేస్తున్నట్లు కూడా నాడు మంత్రుల ఇళ్లలలో సేవలందించే ఉద్యోగులు కూడా ప్రకటించడం గమనార్హం. ఇలా తెలంగాణ కోటాలో మంత్రి పదవిని తెలంగాణకు అనుకూలంగా పని చేయలేదన్నది జనం అభిప్రాయం. అయినా టిఆర్‌ఎస్‌ ఆయనను అక్కున చేర్చుకున్నది. పార్టీలో కలుపుకున్నది. 

నాటి నుంచి మళ్లీ తూర్పు మీద కన్నేశాడు…2016లో టిఆర్‌ఎస్‌లో చేరిన బస్వరాజు సారయ్య 2018 ఎన్నికల్లో టికెట్‌ ఇస్తారని అనుకున్నాడు. కాని పార్టీ సరైన సమయంలో సముచిత స్ధానం కల్పిస్తుందని భరోసా ఇచ్చింది. ఆ ఎన్నికల్లో నన్నపనేని నరేందర్‌కు పార్టీ టిక్కెట్‌ ఇచ్చింది. ఇది ఇష్టంలేని సారయ్య ఆయనకు ప్రచారం చేసిందిలేదన్నది పార్టీలో చెప్పుకునే మాట. పైగా ఆయన లోలోన పార్టీకి వ్యతిరేకంగానే పనిచేశారని కూడా చెప్పుకోవడం విన్నదే…అయినా పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిచింది. కాని ఆయనతీరులో మార్పు రాలేదన్నది పార్టీ నేతల అభిప్రాయం. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎమ్మేల్యే నన్నపనేని మూడు నెలల పాటు అక్కడే వుండి ప్రచారం సాగిస్తే, సారయ్య తూతూ మంత్రంగా తప్ప పనిచేసిందేమీ లేదు. పైగా ఆయన వ్యతిరేక ప్రచారమే సాగించినట్లు కూడా గుసగుసలున్నాయి. ఇదిలా వుంటే నన్నపనేని ఎదుగుదలను తట్టుకోలేక గతంలో తనతో ఎన్నికల వైరంలో ఎదురెరుదు పోటీ చేసిన నాయకులతో కూడా సంబధాలు నెరుపుతూ తూర్పులో ఓ అలకలు, లుకలుకలు సృష్టించే ప్రయత్నం సారయ్య చేస్తున్నాడన్నది పార్టీ శ్రేణుల ప్రధాన ఆరోపణ. అసలు తూర్పులో ఎక్కడా ప్రతిపక్షం అన్నది మచ్చుకైనా లేదు. కాని పార్టీలోనే వున్న ఇతర నేతలను ఉసిగొల్పే ప్రయత్నం నిరంతరం చేస్తున్నాడనేది ప్రధాన ఆరోపణ. 

గతంలో వైరి పక్షమైనా, ఇప్పుడు స్వపక్షంలో కలిసి సాగుతూ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తావా? చెప్పు? ఇక్కడ కాకపోతే మరో పార్టీ ఏదైనా సరే టిక్కెట్టు ఇపిస్తా…? దగ్గరుండి గెలిపిస్తా? అంటూ ఓ నాయకుడికి లేనిపోనివి చెబుతూ వస్తున్నాడట. సారయ్య చెప్పిన సూచనలు ఏమీ ఆ నాయకుడు పట్టించుకోకపోకపోయినా పదిమందిలో కాబోయే ఎమ్మెల్యే అంటే పదే పదే చెప్పుకుంటూ ఆయనలో లేని పోని ఆశలు ఎంతో రేపాలని చూస్తూనే వున్నాడట. ఎలాగైనా తూర్పులో కలకలం రేపాలన్నదే సారయ్య మనసులో నాటుకున్నదని దాని కోసమే ఇదంతా చేస్తున్నాడని కార్యకర్తలు భహిరంగంగానే చెప్పుకుంటున్నారు….ఇదిలా వుంటే మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కడా సారయ్య ప్రచారం చేసినట్లు పెద్దగా కనిపించింది లేదు. తన కోడలుకు మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ బిఫామ్‌ తీసుకొని, తమ్ముళ్లను మాత్రం టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయించారన్నది ప్రపంచానికి తెలిసిన విషయమే..! అయినా ఎమ్మెల్యే నన్నపనేని ఎన్నికలను తన భుజాన వేసుకొని 20 స్ధానాలు గెలిపించుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు కరోనా సమయంలో ఓ తెరాస కార్పోరేటర్‌ మరణించడం జరిగింది. ఆ ఉప ఎన్నికలో అతని భార్య టిఆర్‌ఎస్‌ తరుపున పోటీచేసింది. సానుభూతితో ప్రతిపక్షాలేవీ ఆమెపై పోటీకి సిద్ధపడలేదు. కాని బస్వరాజు సారయ్య సోదరుడు పోటీచేయడం జరిగింది. బస్వరాజు సారయ్య తమ్ముడిని పోటీనుంచి తప్పించే ప్రయత్నం అసలే చేయలేదు. పైగా తమ్ముళ్లతో తనకు మాటలు లేవని దాటేశారన్నది భహిరంగ రహస్యమే…ఇలా పార్టీకి కూడా ఇబ్బందికరమైన పరిస్ధితి తెచ్చాడన్నది నాయకుల వాదన…

 

పార్టీలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య దూరం పెంచి, తూర్పులో కలకలం రేపాలన్నదే సారయ్య ప్రధాన లక్ష్యం? అందుకోసం సారయ్య ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఇద్దరు జోతిష్యులతో మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ సమచారం. సారయ్య అదే పనిగా ఎగదోస్తున్న సదరు నాయకుడి జాతకంలో ఎమ్మెల్యే అయ్యే ఛాన్సులున్నాయా? అన్నదానిపై తొలుత ఓ జ్యోతిష్యుడిని సారయ్య సంప్రదించడం జరిగింది. కాని ఆ అవకాశాలు లేవని జ్యోతిష్యుడు చెప్పడంతో మరో జ్యోతిష్యుడిని కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సదరు నాయకుడికి ఇప్పట్లో ఆ ఛాన్సు లేదని చెప్పినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ నేతను పార్టీ దూరం చేసే కంకణం సారయ్య కట్టుకున్నట్లే తెలుస్తోందంటున్నారు. ఎలాగైనా ఆయనను పార్టీకి దూరం చేసి, నన్నపనేనికి వ్యతిరేకంగా రంగంలో దించాలన్న పట్టుదలతో సారయ్య వున్నట్లు స్పష్టమౌతోందని నాయకులు చెప్పుకుంటున్నారు. కాకపోతే సదరు నాయకుడికి కారు పార్టీని కాదని వెళ్లడం గాని, ఇతర పార్టీలో చేరడం గాని సుతారం ఇష్టం లేదు. కాని ఆయన కుటుంబంలో కూడా కలతలు సృష్టించేలా రాజకీయాలు నెరిపి, చివరికి పార్టీలోనే చిచ్చు పెట్టే ఎత్తుగడలు సారయ్య వేస్తూనే వున్నాడనేది తెలుసున్న విషయం. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదని బిజేపి నుంచైనా టిక్కెట్టు ఇప్పించే బాధ్యత నాదని, కాంగ్రెస్‌లో దయాసాగర్‌తో చెప్పైనా టిక్కెట్టు ఇప్పిస్తానంటూ ఆ నాయకుడి మీద సారయ్య తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇలా పార్టీలో చీలకలకు కారణం కావడం కోసం, తన రాజకీయ భవిష్యత్తును మరింత ఊహించుకొని నియోకజవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారనేది అందరూ అంటున్న మాటే…ఇక తన తమ్ముళ్లతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకుంటుంటే, సారయ్య తమ్ముళ్లు మాత్రం మా అన్న పదవిలో ఆరేళ్లుంటారు…ఎమ్మెల్యే పదవి ఐదేళ్లే…అప్పుడు చూసుకుంటామని కార్యకర్తలను సారయ్య తమ్ముళ్లు బెదిరించడం కూడా జరుగుతున్నట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఇలా తిన్నింటి వాసాలు లెక్కబెడుతూ, అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అక్కున చేర్చుకొని అవకాశం కల్పించినా, సుడిగుండాలు సృష్టించడం మానుకో సారయ్య అంటూ నాయకులు, కార్యకర్తలు హితవు పలుకుతున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుందో, ఎటు దారి తీస్తుందో అన్నది ఆసక్తిగా మారిందన్నది నాయకుల మాట…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!