
"CPI Demands Action on Illegal Constructions in Survey No. 26"
సర్వే నంబర్ 26లో అక్రమ కట్టడాలను ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలి-సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని సీతారాంపూర్ పరిదిలోని సర్వే నెంబర్ 26లో ప్రభుత్వ పరంపోగు భూమిలో నిర్మించిన భవనాలను ప్రభుత్వం స్వాధీన పరుచుకుని ప్రభుత్వ కార్యాలయాలను నెలకొల్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సిపిఐ బృందం పరిశీలించింది. ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నగలపారక సంస్థ పరిధిలో ఉన్న సీతారాంపూర్ లోని సర్వే నెంబర్ 26లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పరంపోగు భూమిలో భవనాలు నిర్మించారని వీటికి ఇంటి నెంబర్లు మున్సిపల్ అధికారులు ఎలా ఇచ్చారన్నారు. పరం పోగు స్థలములో బహుళ అంతస్తులు, లగ్జరీ డూప్లెక్స్ లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్మించి అమ్ముతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేశారన్నారు. ప్రభుత్వ భూముల్లో కొందరు పేదలను ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను బై నెంబర్లు వేసి ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేసి అమ్ముతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరంపోగు ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రభుత్వ స్థలంలో ఇంటి నెంబర్ ఇచ్చిన మున్సిపల్ అధికారులను, కరెంటు మీటర్ ఇచ్చిన విద్యుత్ అధికారులను సస్పెండ్ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో బహుళ అంతస్తులు నిర్మిస్తుంటే మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తుంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారుల మౌనం చూస్తుంటే ఇందులో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్లు అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ భూమిలో భవనాలు నిర్మించి అమ్మిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని వెంటనే అరెస్టు చెయ్యాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సర్వేనెంబర్ 26లో ఉన్న భవనాలన్నింటినీ స్వాధీన పరుచుకుని ప్రభుత్వ కార్యాలయాలను నెలకొల్పాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పేదల తోటి ఇండ్లను ఆక్రమిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రభుత్వ ఈభూమిని పరిశీలించిన వారిలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.