`కదిలిన ఐఅండ్ పిఆర్ యంత్రాంగం…
`నేటిధాత్రి కథనంపై హుటాహుటిన సమావేశం..
`ప్రభుత్వ వార్తలపై ఐఅండ్ పిఆర్ నిర్లక్ష్యాన్ని నిలదీసిన నేటిధాత్రి..
`ఒక్కసారిగా ఐఅండ్ పిఆర్‌లో కుదుపు…
`కాకపోతే నేటిధాత్రి మీద అధికారులు గుర్రు…
`డ్యూటీ గుర్తుచేసినందుకు నేటిధాత్రిపై అధికారుల రుసరుసలు…
`పిఐబి లాగా ఇకపై ప్రభుత్వ వార్తలపై పర్యవేక్షణ తప్పదా? అని నిట్టూర్పులు…
`వార్తలు రాయడం మరిచారు…వాటిని పంపడం మానేశారు?
`జిల్లాలో ఎమ్మెల్యేల అధికారిక వార్తలకు కూడా దిక్కు లేదు?
`సమాచార శాఖ ఆ పని చేయాలన్న అవగాహన ఎమ్మెల్యేలకు కూడా లేదు!
`నాలుగు లైన్లు రాసి పంపే తీరిక లేదు?
`విపత్తు సమయాల్లో ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు హజరైనా సమాచార శాఖ కదలదు?
`గుర్తు చేసినందుకు నేటిధాత్రిని తప్పు పడుతున్నారు!
`ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా మేలుకోకపోతే మునిగేది పార్టీ నే!
`ప్రజలకు దూరమయ్యేది మీరే!
`అధికారులెలాగూ కడుపు కదలకుండా, చల్లగా ఎల్లకాలం అక్కడే వుంటారు?
`అధికారులకు పని పురమాయించండి…లేకుంటే డిపార్ట్మెంట్ లావైపోతుంది!
`ఒక్క వార్త…ఒక్క కుదుపు…
మీడియా వర్గాలలోనే కాదు సమాజం లో కూడా జరగాల్సిన చర్చ…రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలకు తెలియాల్సిన అంశం. ఇంతకీ (ఐఅండ్ పిఆర్) సమాచార పౌరసంబంధాల శాఖ అంటే ఏమిటి? కేవలం పత్రికలకు ప్రకటనలు, అక్రిడిటేషన్ కార్డులేనా? ఆ పని కూడా సకాలంలో జరుగుతుందా? అంటే అదీ జరగదు…అన్నీ పెండిరగే…ఆఖరుకు వార్తలు కూడా పెండిరగే…ఐఅండ్ పిఆర్ అంటే ప్రభుత్వ అధికారిక సమాచార వ్యవస్థ, వారధి. మరి ఆ శాఖ నిత్యం ఎన్ని వార్తలు తయారు చేస్తోంది? ఎన్ని వార్తలు ఎన్ని పత్రికలకు పంపిస్తోంది? జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందుతున్న సమాచారమెంత? ప్రజలు తెలుసుకోవాల్సిన సమాచారాలపై ఎన్ని కథనాలు పత్రికలకు పంపిస్తున్నారు? జిల్లా స్థాయిలలో ఏం జరుగుతోంది. ప్రతి జిల్లాలో సమాచార శాఖ కార్యాలయాలు, సిబ్బంది వున్నారు.
వారికి అవసరమైన పరికరాలు, వాహనాలు వున్నాయి. అవసరమైతే ప్రభుత్వ కార్యక్రమాలకు మీడియా ప్రతినిధులకు సైతం వాహనాలు ఏర్పాటు చేసి మరీ, కవరేజ్ చేయాలి. చేయించాలి. మీడియా కవరేజ్ చేస్తుంది కదా! అని చేతులు దులుపుకొని కూర్చునే వ్యవస్థ కాదు. కచ్చితంగా ఆ ప్రభుత్వ పనితీరు కనిపించేలా , ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తూ వార్తలను రాసి పంపాలి. ఇంత టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో కూడా సమాచారం శాఖ ఎప్పటికప్పుడు వార్తలు అందించేది. ప్యాక్స్ ద్వారా కూడా వార్తలు అందించేవారు. అది ఆ శాఖ విధి. ఇప్పుడు అదంతా మానుకున్నారు. పనులొదులొదిలేసి కాలక్షేపం చేస్తున్నారు. ఈ విషయాలు చాలా మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు తెలియకపోవడం విడ్డూరం. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ సెక్యూరిటీ కోసం ఎలా పనిచేస్తుందో, సమాచార శాఖ అధికారులు కూడా ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యక్రమాలకు విధిగా అందుబాటులో వుండాలి. మీడియా పర్యవేక్షణ సాగించాలి. జిల్లా స్థాయిలో కూడా సమాచార శాఖ సిబ్బంది కార్యాలయాల నుంచి కాలు కదపడం లేదు. అంతదాకా ఎందుకు నిత్యం సరిగ్గా విధులకు హాజరు కావడం లేదు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వస్తున్నారా? లేదా? విధుల్లో వున్నారా? లేరా? అని చూస్తారు. కానీ ఒక్క సమాచార శాఖ వైపు జర్నలిస్టులు కూడా చూడడం మానేశారు. ఎందుకంటే మనలో మీడియా మిత్రులకు సైతం సమాచార శాఖ విధులపై సరైన అవగాహన లేకపోవడం. జర్నలిస్టు సంఘాలు సైతం ఈ విషయాలను ప్రస్తావించకపోవడం. జర్నలిస్టుల శిక్షణా తరగతులలో చెప్పకపోవడం వల్ల ఈ విషయం తెలియకుండా పోతున్నాయి. ఫలానా కార్యాలయంలో అధికారులు పని చేయడం లేదని వార్తలు రాస్తారే గాని, సమాచార శాఖలో అధికారులు విధులకు సక్రమంగా హాజరౌతున్నారా? లేదా అని రాస్తున్నారా? సమాచార శాఖ అధికారుల మీద వార్తలు రాస్తే అక్రిడిటేషన్ ఆపుతారేమో! అన్న భయం కూడా చాలా మందిలో చోటు చేసుకున్నట్లుంది. అక్రిడిటేషన్ అనేది జర్నలిస్టుల హక్కు. దానిని కాపాడుకోవడంలో జర్నలిస్టులు, సంఘాలు విఫలం కావడం వల్లనే సమాచార శాఖ అధికారులు చేయాల్సిన పనులు వదిలేస్తున్నారు. విధులను తప్పించుకుంటున్నారు. సమాచార శాఖ అధికారులే అప్రమత్తంగా లేకపోతే ఎలా?
అధికారులంతా అప్రమత్తంగా వుండాలంటే సమాచార శాఖ మరింత అప్రమత్తంగా వుండమని…! అన్ని శాఖలు అప్రమత్తంగా వుండి సమాచార శాఖ నిద్రపొమ్మని కాదు.. ఆ మధ్య వరంగల్ లో వర్షాలకు ఓ పాత ఇల్లు అర్ధరాత్రి కూలిపోయింది. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే, హుటాహుటిన తన అనుచరులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అక్కడికి ఇతర శాఖల అధికారులు, మేయర్ కూడా చేరుకున్నారు. సమాచార శాఖ అధికారులు జాడ లేరు. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయడానికి, ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఎమ్మెల్యే తన ప్రైవేటు పిఏలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసి, మీడియా కు వివరాలు అందించారు. ఇలా సమాచార శాఖ విధులు తెలియక ఒక్కొక్క ఎమ్మెల్యే అరడజను ప్రైవేటు పిర్వోలను, సోషల్ మీడియా ఇన్ చార్జ్ లను ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో అసలు ఏవి ప్రజా ప్రతినిధుల అధికారిక కార్యక్రమాలో, పార్టీ కార్యక్రమాలో తెలియకుండా పోతోంది. రాష్ట్ర స్థాయి కార్యాలయం ఏం చేస్తుందనేది కూడా పెద్ద మిస్టరీగా మారింది.
ఎప్పుడు చూసిన అన్ని కుర్చీలు ఖాళీనే…కింది స్థాయి సిబ్బంది మాత్రం రివ్యూలలో వున్నారు…మీటింగుల్లో వున్నారని మళ్ళీ మీడియా ప్రతినిధులకే చెప్పి బుకాయిస్తుంటారు. ఏ రివ్యూ జరిగిందన్న దాని మీద మాత్రం ఒక్క వార్త రాసి పంపరు…సీట్లో వుండరు, విధులకు సరిగ్గా హజరుకారు. కంప్యూటర్లలో గేమ్ లు, సెల్ ఫోన్లలో చాటింగ్ లు…! కాకపోతే ఎప్పుడూ ఆన్ డ్యూటీ అంటారు. అంతగా పని చేస్తుంటే గతంలో లాగా ప్రభుత్వ పథకాల మీద ప్రత్యేక శ్రద్ధ ఏది? అ ప్రచారమేది? వాటి రికార్డుల తయారీ ఏదీ? మీడియా సంస్థలకు అందజేసి, ప్రజలకు తెలియజేసిన సమాచారమేది? ఏ ఒక్క పత్రికలో నైనా ప్రభుత్వ విజయాలు, పథకాల మీద ఎడిటోరియల్ పేజీలలో ప్రత్యేకమైన కథనాలు వస్తున్నాయా? ఏఏ పత్రికలలో ఎలాంటి వార్తలు వస్తున్నాయో? గమనిస్తున్నారా? ఎంత సేపు కార్యాలయానికి వచ్చామా? వెళ్లామా? మిగతా సమయాలలో వచ్చిన వాళ్లతో గంటలు, గంటలు ముచ్చట పెట్టామా? పొద్దుబుచ్చుకున్నామా? అంతే…ఔనంటారా? కాదంటారా? ప్రభుత్వానికి ఇవేం పట్డదు…అధికారులకు ఇంతకన్నా మంచి తీరిక మరొకచోట దొరకదు…పేరుకు ఉద్యోగం…ఏమీ చేయాల్సిన పని బాతాఖానీ వ్యవహారం..! కొంత మంది ఇప్పటికీ కొంత నిబద్ధతతో పని చేసే సమాచార శాఖ అధికారులున్నారు…పై విషయాలకు వారు మాత్రం మినహాయింపు! అర్థం చేసుకోగలరు…జర్నలిస్టులు మేలుకోగలరు…ప్రభుత్వ పెద్దలు తేరుకోగలరు