https://epaper.netidhatri.com/
`నేటిధాత్రి కథనానికి ప్రభుత్వ స్పందన.
`ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు.
`వెంటనే ఆదుకుంటామని దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి ప్రకటన.
`శ్రీలతను కలిసిన సంస్థ ప్రతినిధులు.
`నేటిధాత్రికి పలువురి అభినందనలు
`త్వరలోనే బ్యాటరీ ట్రైసైకిల్.
`లక్ష రూపాయల సబ్సిడీ రుణం మంజూరుకు సుముఖత.
`ప్రభుత్వానికి నేటిధాత్రి ధన్యవాదాలు.
హైదరబాద్,నేటిధాత్రి:
కాలం కనికరించక, అయినవారు ఆదుకోక, తోడబుట్టిన వారు తోడు కాకపోయినా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న శ్రీలత దీనగాథ నేటిధాత్రి దినపత్రిక లో చూసి తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసు దేవరెడ్డి చలించిపోయారు. దివ్యాంగుల సంస్థ ద్వారా శ్రీలతకు న్యాయం చేసేందుకు ముందుకొచ్చారు. నేటిధాత్రి దినపత్రిక శ్రీలత పడుతున్న ఇబ్బందుల గురించి ప్రచురించింది. అయిన వాళ్లు వున్నా ఎలా అనాదిగా జీవితం గడుపుతోంది. దేవుడు కూడా అన్యాయం చేసి, అవిటితనాన్ని ఇచ్చినా ఎలా కాలాన్ని ఎదురిస్తుంది అనే విషయాలు నేటిధాత్రి చెప్పింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన వాసుదేవ రెడ్డి తన యంత్రాంగాన్ని పురమాయించారు. దివ్యాంగురాలు శ్రీలత వివరాలు తీసుకురమ్మన్నారు. ఆమెకు వెంటనే బ్యాటరీ ట్రై సైకిల్ అందజేయాలని ఆదేశించారు. అయితే సహజంగా బ్యాటరీ ట్రై సైకిల్ కు సంబంధించిన పరికరాలు కుడివైపు అమర్చబడి వుంటాయి. దివ్యాంగురాలు శ్రీలతకు కుడి చెయ్యి, కుడి కాలు పూర్తిగా లేవు. దాంతో బ్యాటరీ ట్రైసైకిల్ ఆమెకు ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం వుందని వాసుదేవరెడ్డి నేటిధాత్రి కి తెలిపారు. రక్షా బంధన్ రోజునే ఆమెకు ట్రై సైకిల్ అందజేయాలనుకున్నారు. పరికరాల మార్పు కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడిరది. అంతేకాకుండా శ్రీలతకు ఆర్థిక ప్రోత్సాహం కింద లక్షరూపాయల సబ్సిడీ రుణం అందజేయడానికి కూడా వాసుదేవరెడ్డి ఒప్పుకున్నారు. అందుకు అవసరమైన డాక్యుమెంట్లు కూడా శ్రీలత నుంచి అధికారులు తీసుకున్నారు. త్వరలోనే ఆ రుణం కూడా అందనున్నది. ఆ రుణంతో తన కాళ్ల మీద తాను నిలబడేందుకు మరింత ఆత్మ విశ్వాసం కూడగట్డుకునే అవకాశం వుంది.
వాసుదేవరెడ్డి కి నేటిధాత్రి ధన్యవాదాలు:
చలించడం మానవ ధర్మం. అందులోనూ దివ్యాంగుల సంస్థ చైర్మన్ గా వుండి వెంటనే స్పందించి తన కర్తవ్యాన్ని మరోసారి రుజువు చేసుకున్న వాసుదేవరెడ్డికి నేటిధాత్రి అభినందనలు. ఎందుకంటే శ్రీలత గురించిన విషయాలు తెలుసుకున్న వెంటనే స్పందించడం కూడా అభినందనీయమే.
నేటిధాత్రి కి పాఠకుల అభినందనలు:
నేటిధాత్రి ఎప్పుడూ ప్రజల పక్షమే..సమస్యల మీద సమరమే: చీఫ్ ఎడిటర్. కట్టా రాఘవేంద్రరావు.
అభాగ్యురాలు శ్రీలత గురించి నేటిధాత్రి లో కథనం ప్రచురించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేటిధాత్రి దినపత్రికకు ప్రజల నుంచి అభినందనలు అందుతున్నాయి. సామాజిక సమస్యలు వెలుగులోకి తేవడంలో నేటిధాత్రి ముందుంటుందని మరోసారి రుజువైందని పాఠకులు అభినందిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సామాజిక ఇతివృత్తాలు అనేకం తీసుకొని ప్రజలకు బాసటగా నిలిచింది. సామాజిక సృహను, స్పూర్తిని సమాజంలో నింపుతూనే వుంటుంది నేటిధాత్రి. ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల పాలైన వారికి, అవసరమైన అత్యవసర చికిత్సలు చేయించింది. అనాధలైన చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపింది. ఇలా అనేక రకాల వార్తలు ప్రచురించి, సామాజిక కర్తవ్యాన్ని నేటిధాత్రి నిర్వర్తించింది. ఈ పరంపర నేటిధాత్రి అక్షర ప్రయాణం సాగినంత కాలం అంకితభావాన్ని, చైతన్య స్పూర్తిని కొనసాగిస్తూనే వుంటుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు దోహదపడుతూనే వుంటుంది. ఎక్కుడ సమస్య వుంటే అక్కడ నేటిధాత్రి వుంటుంది. ఆ సమస్య పరిష్కారమయ్యే దాకా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే వుంటుంది. నేటిధాత్రి అక్షరాలు అలసిపోయేవి కాదు. సమస్యల నుంచి పారిపోయేవి కాదు. కాలాన్నైనా ఎదురించైనా నేటిధాత్రి కలం రaలిపిస్తూనే వుంటుంది. సమస్యల సాధకు నిరంతరం కృషి చేస్తూనే వుంటుంది. సమయాన్ని భట్డి అక్షరపోరాటం సాగిస్తూనే వుంటుంది. సమస్యలపై వెనుకడగులేదు. ప్రజా సమస్యలు తీరేదాకా ముందడుగు ఆగదు.