వైద్యం కాదు వ్యాపారం?

`పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు

`గతంలో ఒక డాక్టర్‌ ఒక క్లినిక్‌ నడుపుకునే వారు?

`ఇప్పుడు నలుగురు డాక్టర్లు రింగౌతున్నారు?

`సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అంటున్నారు?

`అదే డాక్టర్లు మరో పది మంది కలిసి మల్టీ స్పెషాలిటీ అంటున్నారు?

`సేవ పేరుతో అన్ని రంగాల వాళ్లు వైద్య రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు?

`కొత్త కొత్త పేర్లతో రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు?

`ఒక్కసారి ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరితే ఆ కుటుంబం ఆగమే!

`వీధికో సూపర్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పుతున్నారు?

`ఇరవై నాలుగు గంటల వైద్యం అంటారు? ఒక్క డాక్టర్‌ అందుబాటులో వుండరు?

`కాస్త క్రిటికల్‌ అని తెలియగానే హైదరాబాద్‌ కు రిఫర్‌ చేస్తారు?

`అక్కడి ఆసుపత్రులతో కమీషన్లు మాట్లాడుకుంటారు?

`ప్రభుత్వ ఆసుపత్రులలో కనీసం నాలుగోవంతు భవనాలు కూడా వుండవు?

`నలుగురు డాక్టర్ల పేర్లు బోర్డులో రాసి, రండి రండి అని ప్రచారం చేసుకుంటారు?

`నిలువు దోపిడీకి అడ్డాలుగా మార్చుకుంటున్నారు?

`తరతరాలకు తరగని ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు?

`వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నారు?

`ఉమ్మడి జిల్లాలలో వందలాది ఆసుపత్రులు?

`నరకానికి చాలా వరకు నకళ్లు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి రావడం మంచి పరిణామమే…ఏ రంగంలో నైనా కాంపిటీషన్‌తో ధరలు తగ్గుతాయి. ఒక్క వైద్య రంగంలో మాత్రమే కొత్త ఆసుపత్రులు రావడంతో మరింత ధరలు పెరుగుతుంటాయి. వైద్య విధానంలో సరికొత్త పుంత పేరుతో ఇచ్చే మందులు అవే అయినా, చికిత్సకు మాత్రం భలే డిమాండ్‌ పెరుగుతోంది. హైదరాబాద్‌ నగరంతోపాటు, ఉమ్మడి జిల్లాలు, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రైవేటు ఆసుప్రతుల ఏర్పాటు జరుగుతోంది. గతంలో కనీసం పట్టణాలలో కూడా సరైన వైద్య సదుపాయం అందుబాటులో వుండేది కాదు. అలాంటిది చిన్న చిన్న పట్టణాలలో కూడా పెద్దఎత్తున ఆసుపత్రులు వెలుస్తున్నాయి. ప్రత్యేకంగా కొన్ని వారాలలో స్పెషలిస్టులను తీసుకొచ్చి మరీ వైద్యం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడే లాజిక్‌ వుంది. వైద్యం ముసుగులో వ్యాపారం మిలితమై వుంది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసేందుకు, కొంత కాలం పాటు శిక్షణా కాలం ముగిసిన తర్వాత పల్లెల్లో వైద్యం చేయమంటే మాత్రం ససేమిరా? అంటారు. కాని ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేయడానికి వైద్యులు ముందుంటారు. ప్రజల సొమ్ముతో చదివిన వాళ్లుకూడా పేదలకు వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక లక్షలు పెట్టి సీట్లుకొని చదువుకున్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలతోపాటు, ఉమ్మడి జిల్లాల్లో పనిచేసేందుకు డాక్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు కారణాలున్నాయి. గతంలో ఏ వైద్యుడైనా ఒక్కడే సొంతంగా క్లినిక్‌ ఏర్పాటుచేసుకునేవారు. ఎంత సమయమైనా సరే ఓపి ఓపిగా చూస్తుండేవారు. తప్పని పరిస్ధితి అయితే తప్ప ఆసుపత్రిలో జాయినింగ్‌ చేసుకొని, చికిత్సలు చేసేవారు. మందులతో తక్కువ కాదు అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీలు చేస్తూ వుండేవారు. కాని కాలం మారింది. డాక్టర్ల తీరు కూడా మారింది. వైద్య విద్య పూర్తయిన వెంటనే ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యులుగా పనిచేస్తున్నారు. అందుకు కూడా కారణాలున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ అనుభవంతోపాటు, ఆసుపత్రుల నిర్వహణపై కూడా అవగాహన వస్తుంది. నలుగురు కలిసి ఆసుపత్రి పెట్టేందుకు అసవరమైన స్నేహాలు కూడా అక్కడే చిగురిస్తాయి. దాంతో నలుగురు వైద్యులు కలిసి జిల్లా కేంద్రాలతోపాటు వరంగల్‌, కరీంనగర్‌, వంటి పాత జిల్లా కేంద్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి అని నామకరణంతో ఆసుపత్రులు ఏర్పాటుచేస్తున్నారు. అద్దాలతో కూడిన హాలు, మూడు నాలుగు అంతస్థులంటే చాలు, ఇరుకు భవమైనా సరే…తెల్లారేసరికల్లా ఆసుపత్రులౌతాయి. స్ధానిక నాయకులతోపాటు, జిల్లా స్దాయి నాయకులతో రిబ్బన్‌ కట్‌ చేయించారంటే చాలు పబ్లిసిటీ కూడా వస్తుంది. ఇక కార్పోరేట్‌ వైద్యం అంటూ మొదలుపెడుతున్నారు.

ఇక అనుభజ్ఞులైన కొంత మంది డాక్టర్లు కలిసి సూపర్‌ స్పెషాలిటీ, మల్లీ సూపర్‌ స్పెషాలిటీ అంటూ అందమైన బోర్డులు ఏర్పాటు చేస్తారు. చౌరస్తాలలో పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిసిటీ కూడా బాగానే ఇస్తారు. దాంతో జనానికి ఎప్పుడూ కొత్తొక వింతే… ఏ కొత్త ఆసుపత్రి వచ్చినా ఎవరి చేతిలో ఏం మహిమ వుందో అని అమాయక ప్రజలు వెళ్తుంటారు. ఇక ఓపి ఫీజులు కూడా తక్కువేం వుండవు. ఒక్కసారి డాక్టర్‌ చేతికి మన చేయి వెళ్లిందంటే చాలు, ఎన్ని రకాల వైద్య పరీక్షలు రాస్తారో అన్నది ఆ సమయానికి వారు వున్న మానసిక పరిస్దితి మీద కూడా ఆధారపడి వుంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు. ఇంతా జరిగాక, ఇక్కడ అన్ని సదుపాయాలు లేవు. స్పెషలిస్టులు లేరు. హైదరాబాద్‌కు రాస్తున్నామంటూ చేతులు దులుపుకుంటారు. తాంబూలాలిచ్చామని వదిలేస్తారు. ఇక వైద్యం వంతు హైదరాబాద్‌కు …. అక్కడ ఆసుపత్రిలో చేరగానే వైద్యం మొదలు కాదు. మళ్లీ టెస్టులు. ఒకరోజు ముందు రిఫర్‌ చేసిన ఆసుపత్రి టెస్టులైనా సరే. హైదారాబాద్‌ లో మళ్లీ చేయాల్సిందే… పంపిన ఆసుపత్రికి వాటాలు పంపాల్సిందే…ఇలా అందినకాడికి దోచుకోవడం మాత్రం ఆసుపత్రులకు బాగా అలవాటైపోయింది. 

స్కూళ్లకు గతంలో టెక్నో స్కూల్‌ అంటూ రకరకాల పేర్లు జత చేస్తుండేవారు.ప్రభుత్వం ఇకపై స్కూళ్లకు ఏ విధమైన అదనపు పదాలు జోడిరచొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడా కూడా అలాగే వ్యాపారం జరిగేది. పేర్ల మార్పుతో కొంత మారింది. ఇప్పుడు ఆసుపత్రుల పేర్లలో కూడా ఇవన్నీ తొలగిస్తే గాని ఆసుపత్రుల దోపిడీ ఆగదు. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, ఇలా ఉమ్మడి జిల్లాలలో అనే పెద్ద పెద్ద ఆసుపత్రులున్నాయి. పైగా వైద్య కళాశాలలున్నాయి. అద్దాల మేడల్లాంటి పేరు మోసిన ఆసుపత్రులకు పేరే నిండుదం. వైద్యం శూన్యం అన్నట్లు జిల్లాల నుంచి నిత్యం కొన్ని వందల ఆంబులెన్సులు హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులకు వస్తుంటాయి. పేషెంట్లను తీసుకొస్తుంటాయి. ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి కొన్ని వందలాది అంబులెన్స్‌లు హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులకు వస్తుంటాయి. మరి జిల్లాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులని ఏర్పాటు చేసిన వాటిలో అందరూ స్పెషలిస్టులే అంటారు. అంతే కాదు ఆసుపత్రిలో 24 గంటల వైద్య సదుపాయం. అన్ని రకాల వైద్య పరికరాలు, వైద్యులు అందుబాటులో అంటూ ప్రకటిస్తారు. ఎంతో నైపుణ్యం వున్న వైద్యులు అంటారు. కాని ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఒక రోజు వైద్యం చేయడం రెండో రోజు హైదరాబాద్‌ పంపేయడం ఇది బాగా అలవాటుగా మారింది. డెంగీ వంటి జ్వరాల చికిత్సలో ముంచుకొచ్చేదాకా చూడడం, హైదరాబాద్‌కు పంపేయం ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇక హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో తక్కువలో వైద్యం చేసే ఆసుపత్రులే లేవు. లక్షల మాట తప్ప, వేల మాట అసలే మాట్లాడే పరిస్దితి వుండదు. జనం పెరుగుతున్నారు. వైద్యావసరాలు పెరుగుతున్నాయి.

సీజనల్‌ వ్యాధులు ఎప్పటికప్పుడు విజృంభిస్తూనే వుంటాయి. వీటికి తోడు కరోనా సమస్యలు. ఇతర సమస్యలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. దాంతో కొత్తగా ఆసుపత్రులు ఏర్పాటు చేసుకుంటున్నవారికి నగరాల నడిబొడ్డులో చిన్న భవనం దొరికితే చాలు..బైటకు దానికి హంగూ ఆర్భాటాలు చేస్తే చాలు…అదో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి అవుతుంది. ఉమ్మడి జిల్లాలున్నప్పుడు ఆయా జిల్లాలకు ప్రజలు నిత్యం వస్తుండేవారు. ఇక తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరగడంతో పెద్ద నగరాలకు జనం తాకిడి తక్కువైంది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు తక్కువయ్యారు. నాయకులు కూడా ఉమ్మడి జిల్లాలకు రావడం కూడా తగ్గింది. దాంతో గతంలో మూడు పువ్వులు,ఆరు కాయలుగా సాగిన లాడ్జింగుల వ్యాపారం ఒక్కసారిగా కుప్ప కూలింది. దాంతో నగరం నడిబొడ్డులో వున్న అనేక లాడ్జింగుల్లో కొత్త ఆసుపత్రులు ఏర్పాటౌతున్నాయి. వాటిలో ఎలాంటి కనీస సౌకర్యాలు వుండవు. ఫైర్‌సేప్టీ అంతకన్నా వుండదు. కాని రాత్రికి రాత్రే ఆసుపత్రులు వెలుస్తున్నాయి. పర్మిషన్లు కూడా వస్తున్నాయి. వరంగల్‌లో ఇలా బస్టాండ్‌ దగ్గరలో ఎన్నో కొత్త ఆసుపత్రులు వచ్చాయి. వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ ఆసుపత్రులు నరకానికి నకళ్లుగా మారాయంటున్నారు. ఇలా ఏర్పాటైన ఆసుపత్రుల్లో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. ప్రాణాలు కూడా పోతున్నాయి. కాని అవి వెలుగులోకి రావడంలేదు. అధికారులు పట్టించుకోవడంలేదు. కనీసం ఆ ఆసుపత్రులు ఎవరి పేరు మీద పర్మిషన్లు ఇస్తున్నారోకూడా తెలియడం లేదు. ఇటీవల ఓ మహిళ మరణించిన సంఘటనపై నేటిధాత్రి అనేక కధనాలు రాసింది. కాని ఆ ఆసుపత్రుల మీద చర్య తీసుకున్నవారు లేదు. కొత్త ఆసుపత్రులకు పర్మిషన్లు ఆగడం లేదు. ప్రజల జీవితాలతో ఆటలాడుకోకుండా వుండడం లేదు. వైద్యో నారాయణ హరిః కాస్త…హరీ! అనే దాకా వస్తున్నాయి. ప్రజల జీవితాలు చాలా చిన్నవైపోతున్నాయి. ప్రాణాలు వైద్యుల చేతుల్లో రూకలైపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!